లెక్క సరి చేసిన ఆసీస్: పింక్ బాల్ టెస్ట్‎లో టీమిండియా ఘోర ఓటమి

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్‎లో టీమిండియా ఓటమి పాలైంది. అతిథ్య ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 18 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ ఓపెనర్లు 3.2 ఓవర్లలో సునాయసంగా ఛేదించి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. 

పింక్ బాల్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‎లో విఫలమైన భారత బ్యాటర్లు.. సెకండ్ ఇన్నింగ్స్‎లోనూ చేతులేత్తేశారు. 128/5 ఓవర్ నైట్ స్కోర్‎తో మూడో రోజు ఆట ఆరంభించిన టీమిండియా.. 48 పరుగుల మాత్రమే చేసి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి రెండో ఇన్సింగ్స్‎లో 175 పరుగులకే భారత్ ఆలౌట్ అయ్యింది. తెలంగాణ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులతో టాప్ స్కోరర్‎గా నిలువగా.. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ 24, శుభమన్ గిల్ 28, రిషబ్ పంత్ 28 రన్స్ చేశారు. 

ALSO READ | చేతులేత్తేసిన టీమిండియా.. పింక్ బాల్ టెస్ట్‎లో ఓటమి ఖరారు

కెప్టెన్ రోహిత్ శర్మ 6, విరాట్ కోహ్లీ 11, కేఎల్ 7 పరుగులు మాత్రమే చేసి  మరోసారి తీవ్రంగా నిరాశ పర్చారు. మూడో రోజు ఆట ప్రారంభించిన పంత్, నితీష్ వెంట వెంటనే ఔట్ కావడంతో ఫస్ట్ సెషన్‎లోనే టీమిండియా చాప్టర్ క్లోజ్ అయ్యింది. నితీష్ రెడ్డి రాణించడంతో ఇన్నింగ్స్ ఓటమి నుండి భారత్ గట్టేక్కింది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐదు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. స్కాట్ బోలాండ్ 3, స్పీడస్టర్ స్టార్క్ 2 వికెట్లు తీశారు. ఫస్ట్ ఇన్సింగ్స్‏లో భారత 180 పరుగులు చేయగా.. ఆసీస్ 337 రన్స్ చేసింది. 

తొలి ఇన్సింగ్స్‎లో ఆస్ట్రేలియాకు 157 పరుగుల అధిక్యం దక్కింది. సెకండ్ ఇన్నింగ్స్‎లో 175 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్‎కు 18 పరుగుల స్వల్ప అధిక్యం లభించింది. 19 పరుగుల టార్గెట్ బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఐదు మ్యాచుల సిరీస్‎లో తొలి టెస్ట్ టీమిండియా విజయం సాధించగా.. సెకండ్ మ్యాచులో ఆసీస్ గెలుపొంది లెక్క సరి చేసింది.