ముంబై: యంగ్‌స్టర్ అభిషేక్ శర్మ (54 బాల్స్‌లో 7 ఫోర్లు, 13 సిక్స్‌లతో 135, 2/3) రికార్డు బ్యాటింగ్.. సూపర్ బౌలింగ్‌తో చెలరేగడంతో ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో ఇండియా భారీ విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 150 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. టాస్ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 247/9 స్కోరు చేసింది.
అభితో పాటు శివమ్ దూబే (13 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) ఫర్వాలేదనిపించాడు. తర్వాత ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 రన్స్‌కే కుప్పకూలింది. ఫిల్ సాల్ట్ (55) మినహా మిగతా వారు నిరాశపర్చారు. మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టాడు. అభిషేక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
సిక్సర్ల జాతర..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు అభిషేక్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఉతికి ఆరేస్తూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. తొలి ఓవర్‌లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టిన శాంసన్ (16)ను రెండో ఓవర్‌లో మార్క్ వుడ్ (2/32) ఔట్ చేశాడు. 21/1 స్కోరు వద్ద బ్యాట్ ఝుళిపించడం మొదలుపెట్టిన అభిషేక్ 18వ ఓవర్ వరకు ఎక్కడా ఆగలేదు. ఆర్చర్ (1/55) వేసిన థర్డ్ ఓవర్‌లో 4, 6, 6 కొట్టిన అభిషేక్ తర్వాతి ఓవర్‌లో 4, 4, 6 దంచాడు.
ఐదో ఓవర్‌లో తొలి రెండు బాల్స్‌ను సిక్సర్లుగా మలిచి 17 బాల్స్‌లోనే ఫిఫ్టీ అందుకున్నాడు. ఇదే ఓవర్‌లో మళ్లీ 6, 4 బాదాడు. ఆరో ఓవర్‌లో అభిషేక్ ఫోర్ కొడితే, తిలక్ వర్మ (24) రెండు బౌండ్రీలతో టచ్‌లోకి వచ్చాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఇండియా 95/1 స్కోరు చేసింది. తర్వాతి మూడు ఓవర్లలో అభిషేక్ ఐదు సిక్స్‌లు కొట్టగా, కార్సీ (3/38) బౌలింగ్‌లో తిలక్ వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 115 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. పదో ఓవర్‌లో అభిషేక్ ఫోర్‌తో ఇండియా స్కోరు 143/2కు చేరింది. 11వ ఓవర్‌లో సింగిల్ తీసిన అభిషేక్ 37 బాల్స్‌లోనే సెంచరీ పూర్తి చేశాడు. కానీ సూర్యకుమార్ (2)ను కార్సీ ఔట్ చేయడంతో స్కోరు 145/3గా మారింది.
అభిషేక్‌తో కలిసిన దూబే ఎక్కడా తగ్గలేదు. వరుస ఓవర్లలో 4, 6.. 6, 4 కొట్టాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా అభిషేక్ మాత్రం దంచుడు ఆపలేదు. 14వ ఓవర్‌లో ఫోర్ కొట్టి న దూబే.. కార్సీకి వికెట్ ఇవ్వడంతో నాలుగో వికెట్‌కు 37 రన్స్ జతయ్యాయి. 15వ ఓవర్‌లో సిక్స్ కొట్టి హార్దిక్ (9) ఔటయ్యాడు. 16వ ఓవర్‌లో రింకూ సింగ్ (9) ఎల్బీ అయ్యాడు. అప్పటికి స్కోరు 202/6గా ఉంది. 17వ ఓవర్‌లో అభిషేక్ సిక్స్, ఫోర్ కొడితే, అక్షర్ పటేల్ (15) ఫోర్ దంచాడు. 18వ ఓవర్‌లో అభిషేక్ మరో రెండు సిక్స్‌లు కొట్టి ఔటయ్యాడు. తర్వాతి ఓవర్‌లో మూడు రన్సే వచ్చినా, లాస్ట్ ఓవర్‌లో అక్షర్‌తో పాటు రవి బిష్ణోయ్ (0) వెనుదిరిగారు.
క్యూ కట్టారు..
భారీ ఛేజింగ్‌లో ఇంగ్లండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు ముందు ఇంగ్లిష్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ పోరాటం చేసినా రెండో ఎండ్‌లో సహకారం దక్కలేదు. మూడో ఓవర్‌లోనే షమీ (3/25).. డకెట్ (0)ను ఔట్ చేసి ఇచ్చిన శుభారంభాన్ని మిగతా బౌలర్లు చివరి వరకు కంటిన్యూ చేశారు. దీంతో ఇన్నింగ్స్‌లో సాల్ట్, బెతెల్ (10) మాత్రమే డబుల్ డిజిట్ నమోదు చేశారు. వరుణ్ చక్రవర్తి (2/25), దూబే (2/11), వరుస విరామాల్లో వికెట్లు తీశారు. బట్లర్ (7), బ్రూక్ (2), లివింగ్‌స్టోన్ (9), కార్సీ (3), ఓవర్టన్ (1), ఆర్చర్ (1 నాటౌట్), రషీద్ (6), మార్క్ వుడ్ (0) సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఇంగ్లండ్ చిత్తయింది.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 247/9 (అభిషేక్ 135, దూబే 30, కార్సీ 3/38). ఇంగ్లండ్: 10.3 ఓవర్లలో 97 ఆలౌట్ (సాల్ట్ 55, షమీ 3/25, అభిషేక్ 2/3).
2 ఇండియా తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్ అభిషేక్ శర్మ (37 బాల్స్), రోహిత్ శర్మ (35) ముందున్నాడు.
2 ఈ ఫార్మాట్‌లో రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఇండియా బ్యాటర్‌గా అభిషేక్ (17 బాల్స్) నిలిచాడు.
2 రన్స్ పరంగా ఇండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం. ఇంతకుముందు కివీస్‌పై 168 రన్స్ తేడాతో గెలిచింది.
13 టీ20ల్లో ఇండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ అభిషేక్. రోహిత్ (10)ను దాటేశాడు.
135 టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన ఇండియా ప్లేయర్‌గా అభిషేక్ రికార్డుకెక్కాడు.శుభ్‌మన్ గిల్ (126*)ను అధిగమించాడు.
95/1 టీ20ల్లో ఇండియాకు ఇది అత్యధిక పవర్‌ప్లే స్కోరు. బంగ్లాదేశ్‌పై చేసిన 82/1 రికార్డును బ్రేక్ చేసింది.