
తొమ్మిదిసార్లు టోర్నీ... ఐదుసార్లు ఫైనల్స్.. మూడుసార్లు చాంపియన్లు.. ఓసారి రన్నరప్.. చాంపియన్స్ ట్రోఫీలో స్థూలంగా టీమిండియా కథ ఇది. ఒకప్పుడు ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లంటే తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ఇండియా ఈసారి లో మాత్రం కొత్త తరహా ఆటతీరుతో ఆకట్టుకుంది. లీగ్‌దశ నుంచి అపజయమే లేకుండా ఫైనల్‌కు చేరి.. టైటిల్ ఫైట్‌లోనూ న్యూజిలాండ్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. దాంతో పాటు ‘చాంపియన్స్’ చరిత్రలో ముచ్చటగా మూడో టైటిల్‌తో తొలి స్థానంలో నిలిచింది. రెండు టైటిల్స్‌తో ఆసీస్ రెండో ప్లేస్‌లో ఉంది.
సెమీస్‌తో మొదలెట్టి..
1998లో తొలిసారి మొదలైన ఈ టోర్నీలో ఇండియా సెమీస్‌తోనే సరిపెట్టుకుంది. 2000లో జరిగిన టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్‌కు చేరినా టైటిల్ గెలవలేకపోయింది. ఆనాటి ఫైనల్లో టీమిండియా.. న్యూజిలాండ్ చేతిలో ఓడటంతో ఈసారి కూడా అలాంటి కథే పునరావృతం అవుతుందేమోనని అందరూ భావించారు. కానీ లీగ్ దశలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్లో మాత్రం సూపర్ పెర్ఫామెన్స్ చూపెట్టాడు. టార్గెట్ ఛేజింగ్‌లో బలమైన ఆరంభాన్నిచ్చి మిగతా బ్యాటర్లపై ఒత్తిడిని తగ్గించాడు. కాకపోతే సెంచరీ చేస్తాడని భావించినా ఓ అనవసరపు షాట్‌కు వెళ్లి ఔట్ కావడం ఫ్యాన్స్‌ను నిరాశపర్చింది. 2002లో ఇండియా, శ్రీలంక ఫైనల్మ్యాచ్కు వర్షం అడ్డంకిగా నిలవడంతో రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. ఆ తర్వాత 2004, 2006, 2009లో గ్రూప్ దశలోనే నిష్ర్కమించిన టీమిండియా 2013లో ఇంగ్లండ్‌ను ఓడించి రెండోసారి టైటిల్ గెలిచింది. కానీ 2017లో పాకిస్తాన్ చేతిలో ఓడటంతో ఒక్కసారి ఇంటా, బయటా తీవ్ర విమర్శల పాలైంది.
అందరూ చాంపియన్లే..
గత టోర్నీలతో పోలిస్తే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ వెనక మాత్రం పెద్ద తతంగమే నడిచింది. పాక్ ఆతిథ్యమిస్తుండటంతో ఇండియా అక్కడికి వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో ఇండియా ఆడే మ్యాచ్‌లకు తటస్థ వేదికగా దుబాయ్‌ని ప్రకటించి టోర్నీని మొదలుపెట్టారు. ఈ టోర్నీ కోసం ఇండియా కూడా బలమైన జట్టునే ప్రకటించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్‌తో ముప్పు ఉంటుందని భావించారు. కానీ తొలి మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్‌ను ఓడించి శుభారంభం చేసిన రోహిత్‌సేన తర్వాతి మ్యాచ్‌లో పాకిస్తాన్ భరతం పట్టింది. బంగ్లాపై శుభ్‌మన్‌గిల్ సెంచరీతో చెలరేగితే, పాక్‌పై కింగ్ కోహ్లీ వందతో మరోసారి హీరోగా నిలిచాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో వరుణ్‌చక్రవర్తి తన స్పిన్ మ్యాజిక్‌తో ఇండియాను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ కూడా మెరిశాడు. ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో మళ్లీ చెలరేగిన విరాట్ ఫైనల్లో విఫలం కావడం ఒకింత బాధకు గురి చేసింది. అయినప్పటికీ శ్రేయస్, రాహుల్, అక్షర్‌కు తోడు జడేజా విన్నింగ్ షాట్‌తో చిరస్మరణీయ విజయం సొంతమైంది. ఓవరాల్‌గా ప్రతి మ్యాచ్‌లో ఎవరో ఒకరు సత్తా చాటడంతో అపజయమే లేకుండా ట్రోఫీని గెలిచిన టీమిండియాలో అందరూ చాంపియన్లే. ఇక మూడోసారి చాంపియన్స్ ఫైనల్ ఆడిన కివీస్ 2000లో ఇండియాను ఓడించి విన్నర్‌గా నిలిచింది. 2009లో ఆసీస్ చేతిలో, ఇప్పుడు ఇండియా చేతిలో ఓడి మళ్లీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.