విండీస్పై కిర్రాక్ విక్టరీ..మూడో వన్డే విజయంతో సిరీస్ కైవసం

విండీస్పై కిర్రాక్ విక్టరీ..మూడో వన్డే విజయంతో సిరీస్ కైవసం

టరౌబా: వెస్టిండీస్‌తో చివరి వన్డేలో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. ఆగస్టు 2వ తేదీ బుధవారం తెల్లవారుజామున ముగిసిన మ్యాచ్‌లో భారత్ ఏకంగా 200 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.  ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో టీమిండియా దక్కించుకుంది. 

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్  50 ఓవర్లలో 5 వికెట్లకు 351 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(64 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77), శుభ్‌మన్ గిల్(92 బంతుల్లో 11 ఫోర్లతో 85), సంజూ శాంసన్(41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51), హార్దిక్ పాండ్యా(52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో రోమారియో షెఫర్డ్ రెండు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్, గుడకేష్ మోతీ, యాన్నిక్ కరయ్య తలో వికెట్ తీసారు. భారత బ్యాటింగ్‌లో రుతురాజ్ గ్వైకాడ్(8) విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్(35), రవీంద్ర జడేజా(8 నాటౌట్) పర్వాలేదనిపించారు.

ఆ తర్వాత 352 పరుగుల టార్గెట్ తో బరిలోకి  దిగిన వెస్టిండీస్.. 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది.  శార్దూల్ ఠాకూర్(4/37), ముకేష్ కుమార్(3/30), కుల్దీప్ యాదవ్(2/25) రాణించగా.. జయదేవ్ ఉనాద్కత్ ఓ వికెట్ పడగొట్టాడు. వెస్టిండీస్ బ్యాటర్లలో అలిక్ అథనాజ్(50 బంతుల్లో 3 ఫోర్లతో 32), గుడకేష్ మోతీ(34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బ్రాండన్ కింగ్(0), కైల్ మేయర్స్(4), షై హోప్(5), కీసీ కార్టీ(6), షిమ్రాన్ హెట్‌మైర్(4), రోమారియో షెఫెర్డ్(8) విఫలమయ్యారు. మూడు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించిన  ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. శుభ్‌మన్ గిల్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. వెస్టిండీస్‌పై  టీమిండియాకు ఇది వరుసగా 16వ వన్డే సిరీస్ విజయం.