- టీ20 బౌలర్లలో టాప్ ర్యాంక్ సొంతం
దుబాయ్: టీమిండియా యంగ్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. బుధవారం విడుదలైన తాజా జాబితాలో ఐదు ప్లేస్‌లు మెరుగయ్యాడు. అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను వెనక్కునెట్టి టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. అతని ఖాతాలో ఇప్పుడు 699 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెండో ప్లేస్‌కు చేరిన రషీద్ 692 పాయింట్లతో నిలిచాడు.
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 9 వికెట్లతో సత్తా చాటడంతో 23 ఏండ్ల బిష్ణోయ్ ర్యాంక్ మెరుగైంది. లంక స్పిన్నర్ వానిందు హసరంగ, ఇంగ్లండ్ క్రికెటర్ ఆదిల్ రషీద్ చెరో 679 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. అక్షర్ పటేల్ తొమ్మిది ప్లేస్‌లు మెరుగై 18వ స్థానంలోకి వచ్చాడు.
మరోవైపు ఆసీస్‌తో సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉండగా, రుతురాజ్ గైక్వాడ్ 6 నుంచి ఏడో ప్లేస్‌కు పడిపోయాడు.ఆల్‌రౌండర్లలో హార్దిక్ పాండ్యా మూడో స్థానం నిలబెట్టుకున్నాడు.