న్యూఢిల్లీ : టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని మించిపోయాడు. ఫిట్‌నెస్‌లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన కోహ్లీని దాటేశాడు. ఆసియా కప్ కోసం టీమిండియా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో స్పెషల్ ట్రెయినింగ్ క్యాంప్‌లో పాల్గొంటోంది. ఫిట్‌నెస్ డ్రిల్స్‌తో పాటు ప్లేయర్లకు యోయో ఫిట్ నెస్ టెస్టులకు అటెండ్ అవుతున్నారు. ఇండియా టీమ్‌లో ప్లేస్ ఉండాలంటే ఈ టెస్టులో 16.5 స్కోరు సాధించాల్సి ఉండగా.. గురువారం టెస్టుకు హాజరైన తనకు 17.2 పాయింట్లు వచ్చాయని కోహ్లీ వెల్లడించాడు.
శుక్రవారం ఇతర ప్లేయర్లు టెస్టులో పాల్గొన్నారు. ఇందులో గిల్ టీమ్‌లో అందరికంటే ఎక్కువగా ఏకంగా 18.7 స్కోరు చేశాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు తన యోయో ఫిట్‌నెస్ టెస్టు స్కోరును సోషల్ మీడియాలో షేర్ చేసిన కోహ్లీ బోర్డు హెచ్చరిక అందుకున్నట్టు తెలుస్తోంది. రహస్యంగా ఉంచాల్సిన ఈ విషయాలను ఇలా బహిర్గతం చేయొద్దని కోహ్లీతో పాటు ప్లేయర్లందరికీ స్పష్టం చేసినట్టు సమాచారం.