
కొలంబో: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఇండియా విమెన్స్ టీమ్.. ముక్కోణపు వన్డే సిరీస్‌లో బోణీ చేసింది. ఛేజింగ్‌లో ప్రతీకా రావల్ (50 నాటౌట్), స్మృతి మంధాన (43), హర్లీన్ డియోల్ (48 నాటౌట్) దంచికొట్టడంతో.. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. వర్షం వల్ల ఆటను 39 ఓవర్లకు కుదించారు. దీంతో టాస్ ఓడిన లంక 38.1 ఓవర్లలో 147 రన్స్‌కే ఆలౌటైంది. హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్. ఇండియా బౌలర్లు స్నేహ్ రాణా (3/31), దీప్తి శర్మ (2/22), శ్రీ చరణి (2/26) ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది.
కావిషా దిల్హారి (25), అనుష్క సంజీవని (22), అచిని కులసురియా (17) పోరాడి విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 29.4 ఓవర్లలో 149/1 స్కోరు చేసి నెగ్గింది. లంక బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్న రావల్.. మంధానతో తొలి వికెట్‌కు 54 రన్స్, హర్లీన్ డియోల్‌తో రెండో వికెట్‌కు 95 రన్స్ జత చేసింది. ఇనోకా రణవీర ఒక్క వికెట్ తీసింది. ప్రతీకాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం జరిగే రెండో మ్యాచ్‌లో ఇండియా.. సౌతాఫ్రికాతో తలపడుతుంది.