- రింకూ సింగ్ ఫామ్‌పై ఫోకస్
- రా. 8.30 నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో
జొహనెస్‌బర్గ్ : సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఆఖరి సవాల్‌కు సిద్ధమైంది. రెండో మ్యాచ్‌లో తడబాటును వీడుతూ సెంచూరియన్‌లో సఫారీలను పడగొట్టిన ఇండియా అచ్చొచ్చిన వేదికపై సిరీస్ పట్టేయాలని చూస్తోంది. శుక్రవారం జరిగే నాలుగో, చివరి టీ20లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. 2007లో ఇదే వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించిన టీమిండియా టీ20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన చివరి టీ20 సెంచరీని కూడా గతేడాది ఇదే గ్రౌండ్‌లో చేసి జట్టును గెలిపించాడు.
టీ20 కెప్టెన్ సూర్యకుమార్ సక్సెస్ రేటు 81.25 శాతంగా ఉంది. సూర్య కెప్టెన్సీలో ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఇండియా 13 టీ20లు గెలిచింది. అదే జోరుతో మరో విజయంతో పాటు సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. సిరీస్‌లో ఆధిక్యం.. వేదికపై మంచి రికార్డు ఉండటంతో ఈ పోరులో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై సిరీస్ నెగ్గలేకపోతున్న సఫారీ జట్టు కనీసం సమం చేసి పరువు దక్కించుకోవాలని ఆశిస్తోంది. వాండరర్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు ఆశించొచ్చు.
రింకూ రాణించాల్సిందే
తొలి టీ20లో సంజూ శాంసన్, మూడో మ్యాచ్‌లో తిలక్ వర్మ సెంచరీలతో దంచడంతో సిరీస్‌లో ఇండియా 2–1తో ఆధిక్యంలో ఉంది. వరుసగా ఫెయిలవుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌లోకి రావడంతో టాపార్డర్ గాడిలో పడినట్టు కనిపిస్తోంది. అయితే, సిరీస్ నెగ్గాలంటే మిడిల్, లోయర్ ఆర్డర్ కూడా రాణించాల్సిందే. ముఖ్యంగా రింకూ సింగ్ తక్షణమే గాడిలో పడాల్సిన అవసరం ఉంది. టీ20 క్రికెట్‌లో మంచి హిట్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న రింకూ కొన్ని నెలలుగా ఆకట్టుకోవడం లేదు.
గత మూడు మ్యాచ్‌ల్లోనూ 11, 9, 8 స్కోర్లతో 28 రన్స్ మాత్రమే చేశాడు. తనకు అప్పజెప్పిన ఫినిషర్ పాత్రకు న్యాయం చేయలేకపోతున్నాడు. అయినా కెప్టెన్ సూర్య, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అతనిపై నమ్మకం ఉంచారు. కాబట్టి ఈ మ్యాచ్‌లో అయినా తను గాడిలో పడతాడేమో చూడాలి. వరుసగా రెండు సెంచరీల తర్వాత రెండు డకౌట్లతో నిరాశపరిచిన ఓపెనర్ సంజూ శాంసన్ మళ్లీ బ్యాట్ ఝుళిపించాలి.
కెప్టెన్ సూర్యకుమార్ కూడా ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంది. బౌలర్లు కూడా మెరుగ్గా రాణిస్తేనే ప్రత్యర్థిని కట్టడి చేయొచ్చు. గత మ్యాచ్‌లో రమణ్‌దీప్‌కు చాన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఆఖరి పోరులో యంగ్ పేసర్లు యష్ దయాల్, విజయ్‌కుమార్‌లో ఒకరికి మేనేజ్‌మెంట్ అరంగేట్రం అవకాశం కల్పిస్తుందేమో చూడాలి.
సమంపై సఫారీల దృష్టి
తొలి మ్యాచ్‌లో తేలిపోయిన తర్వాత గత రెండు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా అద్భుతంగా ఆడింది. గెబెహాలో ఓటమి అంచుల నుంచి తేరుకొని గెలిచిన ఆ జట్టు సెంచూరియన్‌లో భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసినంత పని చేసింది. వ్యక్తిగతంగా ఒకరిద్దరు ఆకట్టుకుంటున్నా సమష్టిగా రాణించలేకపోవడంతోనే ఆ జట్టు సిరీస్‌లో 1–2తో వెనకబడింది. మార్కో యాన్సెన్ అటు బౌలింగ్, బ్యాటింగ్‌తో సత్తా చాటుతున్నాడు. బంతితో అతనికి సరైన సహకారం లభించకపోవడంతో గత పోరులో ఆ జట్టు ఇండియాకు భారీ స్కోరు ఇచ్చుకుంది. కొత్త బౌలర్ సిపమ్లాతో పాటు కొయెట్జీ తేలిపోయాడు.
సిరీస్ సమం చేయాలంటే మిగతా బౌలర్లు రాణించడంతో పాటు బ్యాటింగ్‌లోనూ సఫారీలు మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. సెంచూరియన్‌లో రికెల్టన్, హెండ్రిక్స్, మార్‌క్రమ్ తమ శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. హిట్టర్ క్లాసెన్ గాడిలో పడినా తన హిట్టింగ్‌తో జట్టును గెలిపించలేకపోయారు. మరో సీనియర్ బ్యాటర్ మిల్లర్ వైఫల్యం జట్టును దెబ్బతీస్తోంది. ఏదేమైనా సమష్టిగా సత్తా చాటితేనే టీమిండియా జోరును అడ్డుకొని సౌతాఫ్రికా సిరీస్‌ను పంచుకోగలదు.