గిల్ జిగేల్‌..‌‌‌‌‌‌‌ తొలి వన్డేలో 4 వికెట్లతో ఇండియా విక్టరీ

గిల్ జిగేల్‌..‌‌‌‌‌‌‌ తొలి వన్డేలో 4 వికెట్లతో ఇండియా విక్టరీ

నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: చాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో టీమిండియా తొలి అడుగు బలంగా వేసింది. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో తొలి వన్డేలో ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్ షోతో సూపర్ విక్టరీ సాధించింది. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్ (96 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 14 ఫోర్లతో 87) ముందుండి నడిపించడంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 4 వికెట్ల తేడాతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌లో 1–0తో ఆధిక్యం దక్కించుకుంది. తొలుత ఇంగ్లండ్‌‌‌‌47.4 ఓవర్లలో 248 స్కోరుకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్ (52), జాకబ్ బెతెల్ (51), ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిల్ సాల్ట్ (43) రాణించారు.

 జడేజా (3/26), అరంగేట్రం బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్షిత్ రాణా (3/53) చెరో మూడు వికెట్లతో దెబ్బకొట్టారు. అనంతరం ఇండియా 38.4 ఓవర్లలోనే 251/6 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. గిల్‌‌‌‌‌‌‌‌కు తోడు శ్రేయస్ అయ్యర్ (36 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 59), అక్షర్ పటేల్ (47 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 52) ఫిఫ్టీలతో మెరిశారు. గిల్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం కటక్‌‌‌‌‌‌‌‌లో జరుగుతుంది. 

తడబడి.. చెలరేగి

చిన్న టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో మొదట ఇండియా తడబడింది. అరంగేట్రం ఆటగాడు యశస్వి జైస్వాల్ (15) నిరాశపరచగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (2) పేలవ ఫామ్‌‌‌‌‌‌‌‌ను కొనసాగించాడు. ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో జైస్వాల్‌‌‌‌‌‌‌‌.. మహ్మూద్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో రోహిత్ ఔటవడంతో ఆతిథ్య జట్టు 19/2తో నిలిచింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో క్రీజులోకి వచ్చిన గిల్‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్ బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. శ్రేయస్‌‌‌‌‌‌‌‌ స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేయగా.. గిల్‌‌‌‌‌‌‌‌ నిలకడగా ఆడాడు. ఎదుర్కొన్న మూడో బాల్‌‌‌‌‌‌‌‌నే  బౌండ్రీకి తరలించిన శ్రేయస్‌‌‌‌‌‌‌‌.. ఆర్చర్ వేసిన ఏడో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 

కార్స్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో మూడు ఫోర్లతో జోరు చూపెట్టడంతో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేలో 71/2తో ఇండియా  కోలుకుంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ల బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ శ్రేయస్‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. బెతెల్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 30 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అయ్యర్ మరో ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో స్కోరు వంద దాటించాడు. కానీ, బెతెల్‌‌‌‌‌‌‌‌ వేసిన 16వ  ఓవర్లో స్వీప్ షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసి ఎల్బీ అవ్వడంతో మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు  64 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 94  రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. బ్యాటింగ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రమోట్‌‌‌‌‌‌‌‌ అయిన అక్షర్ వచ్చీరాగానే ఫోర్, సిక్స్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. 

మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో గిల్ కూడా జోరు పెంచాడు. వరుసగా బౌండ్రీలు కొడుతూ 60 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కార్స్‌‌‌‌‌‌‌‌ వేసిన 29వ ఓవర్లో చెరో రెండు ఫోర్లు రాబట్టడంతో స్కోరు 200 దాటింది. ఈ క్రమంలో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు రాహుల్ (2)ను ఆదిల్ ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గిల్ నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 108 రన్స్ జోడించారు. సెంచరీ చేస్తాడని అనుకున్న గిల్‌‌‌‌‌‌‌‌ను మహ్మూద్‌‌‌‌‌‌‌‌ పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చగా.. హార్దిక్ (9 నాటౌట్‌‌‌‌‌‌‌‌), జడేజా (12 నాటౌట్‌‌‌‌‌‌‌‌) లాంఛనం పూర్తి చేశారు. 

ఆరంభం వాళ్లది.. ముగింపు మనది

ఫ్లాట్ వికెట్‌‌‌‌‌‌‌‌పై టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు అద్భుత ఆరంభం లభించింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్‌‌‌‌‌‌‌‌, బెన్ డకెట్‌‌‌‌‌‌‌‌ పవర్ ప్లేలో దంచికొట్టారు. హర్షిత్ రాణా బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సాల్ట్‌‌‌‌‌‌‌‌, షమీ ఓవర్లో డకెట్‌‌‌‌‌‌‌‌ చెరో రెండు ఫోర్లతో టచ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చారు. రాణా వేసిన ఆరో ఓవర్లో సాల్ట్‌‌‌‌  6, 4, 6, 4, 6తో ఒక్కసారిగా రెచ్చిపోయి 26 రన్స్ రాబట్టాడు. ఎనిమిదో ఓవర్లో బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన స్పిన్నర్ అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సాల్ట్‌‌‌‌‌‌‌‌ ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో స్వాగతం పలకగా.. డకెట్ రెండు బౌండ్రీలతో జోరు చూపెట్టాడు. కానీ, ట్రిపుల్ తీసే ప్రయత్నంలో శ్రేయస్ అయ్యర్ కొట్టిన త్రోకు సాల్ట్‌‌‌‌‌‌‌‌ రనౌటవ్వడంతో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు75 రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది. 

హర్షిత్ రాణా వేసిన తర్వాతి ఓవర్లోనే జైస్వాల్ పట్టిన సూపర్ క్యాచ్‌‌‌‌‌‌‌‌కు డకెట్‌‌‌‌‌‌‌‌ ఔటవగా.. బౌన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెంటాడిన హ్యారీ బ్రూక్ (0) కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి డకౌట్‌‌‌‌‌‌‌‌గా వెనుదిరిగాడు. దాంతో ఇంగ్లిష్ టీమ్ 77/3తో డీలా పడింది. జో రూట్ (19), బట్లర్ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు వంద దాటించారు. కానీ, జడేజా బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో రూట్‌‌‌‌‌‌‌‌ ఎల్బీ అయ్యాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న  బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు బెతెల్‌‌‌‌‌‌‌‌ క్రమం తప్పకుండా బౌండ్రీలు కొడుతూ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ను చక్కదిద్దారు. 

కానీ, ఫిఫ్టీ పూర్తి చేసుకున్న బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఔట్ చేసిన అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ జోడీని విడదీశాడు. మళ్లీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన రాణా.. లివింగ్‌‌‌‌‌‌‌‌స్టోన్ (5)ను వెనక్కిపంపగా.. స్కోరు 200 దాటిన వెంటనే కార్స్‌‌‌‌‌‌‌‌ (10)ను షమీ బౌల్డ్ చేశాడు. మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో ఒంటరి పోరాటం చేస్తూ ఫిఫ్టీ పూర్తి చేసుకున్న బెతెల్‌‌‌‌‌‌‌‌ను జడేజా ఎల్బీగా ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ 220/8తో నిలిచింది. చివర్లో జోఫ్రా ఆర్చర్ (21 నాటౌట్‌‌‌‌) విలువైన రన్స్ అందించినా.. ఆదిల్ రషీద్‌‌‌‌‌‌‌‌ (8), సకీబ్‌‌‌‌‌‌‌‌ (2) నిరాశపరచడంతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ ఆలౌటైంది. 

ఇంటర్నేషనల్ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో మూడు ఫార్మాట్లలో కలిపి జడేజా పడగొట్టిన వికెట్లు 600. దీంతో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. కుంబ్లే (953), అశ్విన్ (765), హర్భజన్ (707), కపిల్ దేవ్ (687) ముందున్నారు. 

1టెస్టు, టీ20, వన్డే ఫార్మాట్లలో అరంగేట్రం మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనే మూడు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఇండియా తొలి బౌలర్‌‌‌‌‌‌‌‌గా‌‌‌‌‌‌‌‌ హర్షిత్ రాణా రికార్డుకెక్కాడు.