అనుకోకుండా జరిగిపోయింది!..ఎస్ఎల్​బీసీ టన్నెల్ కూల్తదని ఊహించలేకపోయాం

అనుకోకుండా జరిగిపోయింది!..ఎస్ఎల్​బీసీ టన్నెల్ కూల్తదని ఊహించలేకపోయాం
  • ఎస్ఎల్​బీసీ టన్నెల్ పైకప్పు కూల్తదని ఊహించలేకపోయాం
  • రాష్ట్ర ప్రభుత్వానికి అధికారుల బృందం ప్రాథమిక నివేదిక
  • సాయిల్ సెన్సిటివ్​గా ఉందని ముందే గుర్తించినం
  • అన్ని రకాల టెస్టులు చేశాకే పనులు మొదలుపెట్టినం
  • ఏం జరుగుతుందో తెలిసేలోపే 8 మంది చిక్కుకుపోయారని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన అనుకోకుండా జరిగిన ప్రమాదమని..రాష్ట్ర ప్రభుత్వానికి అధికారుల బృందం ప్రాథమికంగా నివేదించినట్లు తెలి సింది. ప్రమాదం జరుగుతుందని అసలు ఎవరూ ఊహించలేకపోయారని వివరించినట్లు సమాచారం. ఎస్ఎల్​బీసీ టన్నెల్​లో నీటి ఊటల కారణంగా గత కొన్నేండ్లుగా నిరంతరం డీ వాటరింగ్, డీ స్టీలింగ్ కొనసాగుతున్నదని వివరించింది. 

ఇందుకు సంబంధించి దాదాపు రూ.21 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు తెలిపింది. ఊట (సీపేజీ) నుంచి నీళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలుసని.. అందులో భాగంగానే ఎక్కువ మొత్తంలో డీ వాటరింగ్ చేస్తున్నట్లు నివేదికలో అధికారులు పేర్కొన్నారు. అయితే, అనుకోకుండా టన్నెల్ పైకప్పు మట్టి కూలడం.. దానికి నీళ్లు తోడు కావడంతో మొత్తం బురదమయంగా మారినట్లు ప్రాథమికంగా అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి నివేదించినట్లు తెలిసింది. 

అన్ని రకాల టెస్టులు పూర్తి చేశాకే పనులు మొదలుపెట్టారని వివరించారు. ఇప్పుడు పనులు జరుగుతున్న ప్రాంతంలో సాయిల్ సెన్సిటివ్ గా ఉందనే విషయం ముందే తెలుసని పేర్కొన్నారు. నెమ్మదిగా టన్నెల్ పనులు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. నెలకు 300 మీటర్ల చొప్పున టన్నెల్ తవ్వాలని నిర్మాణ సంస్థ నిర్ణయించింది. అయినప్పటికీ.. అంతకంటే తక్కువే తవ్వేందుకు డిసైడ్ అయినట్లు చెప్పారు. 

దాదాపు 18 ఏండ్లుగా టన్నెల్ పనులు కొనసాగడం కూడా భూమి లోపల మార్పులకు కారణమని పేర్కొన్నట్లు తెలిసింది. ఒక వైపు డీ వాటరింగ్.. ఇంకోవైపు పెచ్చులూడి పడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంటు పూత పూస్తూ పనులు చేయడం కష్టమైనదని వివరించారు. ఏండ్ల తరబడిగా పనులు జరుగుతుండటంతో సమస్యలు పెరుగుతూ వచ్చినట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. 

పనులు జరుగుతున్నప్పుడు కామన్​గానే పెచ్చులు ఊడుతాయని.. అయితే, ఈ స్థాయిలో మట్టి కూలుతుందని ఎవరూ ఊహించలేదని పేర్కొన్నట్లు తెలిసింది. సొరంగం లోపల భూమి లూజ్​గా ఉండే ప్రాంతాన్ని రాడర్​తో గుర్తించడంతో పాటు.. అది కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. టన్నెల్ మిషిన్ నడుస్తున్న సమయంలో పెద్ద శబ్దం వస్తుంది. 

ఆ సమయంలో శబ్దాన్ని గ్రహించే వాతావరణం అక్కడ ఉండదు. ప్రత్యేక పరికరాలు ధరించాల్సి ఉంటుంది. అయితే, ప్రమాదం జరిగే టైమ్​లో టన్నెల్​ మిషిన్​కు అటువైపు ఉన్న వాళ్లకు ఏం జరుగుతుందో తెలిసిలోపే పై నుంచి మట్టి కూలడం, దానికి బురద తోడవ్వడం.. బయటకు వచ్చేందుకు మెషిన్ అడ్డుగా ఉండటంతో మిగిలిన 8 మంది చిక్కుకుని ఉంటారని తెలిపారు.