- జట్టుగా చాలా కష్టపడ్డాం- రోహిత్ శర్మ
బ్రిడ్జ్ టౌన్ (బార్డడోస్): ఎన్నో ఏండ్ల పోరాటం తర్వాత ఇండియాకు మరో వరల్డ్ కప్ అందించి లెజెండరీ కెప్టెన్లు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ సరసన నిలిచిన రోహిత్ శర్మ ఈ విజయాన్ని అస్వాదిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని అప్పుడే పుట్టిన పసిపిల్లలా ఒడిసి పట్టుకున్న రోహిత్ చిరునవ్వులు చిందిస్తూ పోస్ట్–-టోర్నమెంట్ ఫొటో షూట్‌లో పాల్గొన్నాడు. వెస్టిండీస్ గడ్డపై అసాధారణ పోరాటంతో టోర్నీలో అజేయంగా నిలుస్తూ.. ట్రోఫీ అందుకోవడం అంతా ఓ కలలా అనిపిస్తోందని హిట్‌మ్యాన్ చెబుతున్నాడు.
కప్ నెగ్గిన రోజు రాత్రి మొదలైన తమ జట్టు విజయ సంబరాలు మరుసటి రోజు తెల్లవారుజాము వరకూ కొనసాగాయని తెలిపాడు. దాంతో తాను సరిగ్గా నిద్రపోలేదన్నాడు. అయితే కంటి నిండా నిద్రపోయేందుకు ఇకపై తనకు చాలా సమయం ఉంటుందని రోహిత్ చెప్పాడు. ‘నాకు ఇదంతా ఓ కలలా అనిపిస్తోంది. ఫైనల్లో గెలిచి వరల్డ్ కప్ నెగ్గినా.. ఇదంతా జరగలేదని అనిపిస్తోంది. ప్రస్తుతం నేను ఈ క్షణంలో జీవిస్తున్నా.
ప్రతీ నిమిషాన్ని, ప్రతీ సెకండ్‌ను ఆస్వాదిస్తున్నా. మ్యాచ్ ముగిసిన క్షణం నుంచే మేం విజయానందంలో మునిగిపోయాం. ఇలాంటి క్షణాల కోసం మేం ఎన్నో ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. కప్పు నెగ్గాలని కలగన్నాం. ఈ ట్రోఫీని అందుకునేందుకు చాలా కాలం పాటు ఒక జట్టుగా ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు ట్రోఫీని చేతుల్లోకి తీసుకోగానే ఆ కష్టమంతా మర్చిపోయి ఎంతో ఉపశమనంగా అనిపించింది. మనం దేనికోసమైనా చాలా కష్టపడి పని చేసి, చివరికి దాన్ని అందుకున్నప్పుడు కలిగే ఆనందమే వేరు’ అని రోహిత్ బీసీసీఐ టీవీతో చెప్పుకొచ్చాడు.
ఆ పిచ్‌ను నాలో భాగం చేసుకోవాలని..
ఫైనల్ గెలిచిన తర్వాత రోహిత్ పిచ్‌పై మట్టిని నోట్లో పెట్టుకోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. వింబుల్డన్ నెగ్గినప్పుడు టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ కూడా ఇలానే గ్రౌండ్‌లోని పచ్చికను తినేవాడు. దాంతో జొకోవిచ్‌ను రోహిత్ అనుకరించాడని అనుకున్నారు. అయితే, తాను అలా చేయాలని ముందుగా అనుకోలేదని రోహిత్ వెల్లడించాడు. ‘నేను ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ పిచ్ వద్దకు వెళ్లాను. ఆ పిచ్ మాకు ట్రోఫీని అందించింది. ఆ మైదానం, పిచ్ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దాన్ని నాలో భాగం చేసుకోవాలని అనుకున్నా. అందుకే పిచ్‌పై మట్టిని నోట్లో వేసుకున్నా’ అని రోహిత్ వివరించాడు.