IND vs ENG 5th Test: ధర్మశాల టెస్ట్ మనదే.. ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లాండ్ చిత్తు

IND vs ENG 5th Test: ధర్మశాల టెస్ట్ మనదే.. ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లాండ్ చిత్తు

ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి టెస్టులో ఓడిపోయిన తర్వాత అద్భుతంగా పుంజుకుంది. సాలిడ్ కంబ్యాక్ ఇస్తూ వరుసగా నాలుగు టెస్టుల్లో జయభేరి మోగించింది. వరుసగా మూడు టెస్టులో గెలిచి సిరీస్ గెలుచుకున్న మనోళ్లు.. తాజాగా ధర్మశాల టెస్టులోనూ ఇంగ్లాండ్ ను చిత్తు చేసి 4-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ కు అదిరిపోయే ముగింపు పలికింది.

తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగులు వెనకపడిన ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్ లో అత్యంత దారుణంగా బ్యాటింగ్ చేసింది. ఒక్క రూట్ (84) మినహాయిస్తే మిగిలిన వారందరూ విఫలమయ్యారు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో కేవలం 195 పరుగులకే ఆలౌటైంది. భారత స్పిన్నర్లు అశ్విన్ 5 వికెట్లతో సత్తా చాటి ఇంగ్లాండ్ ను ఓటమికి కారణమయ్యాడు. తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా.. జడేజాకు ఒక వికెట్ దక్కింది.  

5 వికెట్ల నష్టానికి 103 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ (8), హర్టీలి (20), మార్క్ వుడ్ (0) వికెట్లను త్వరగా కోల్పోయింది. ఈ దశలో రూట్, బషీర్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. 9 వికెట్ కు 48 పరుగుల భాగస్వామ్యం తర్వాత జడేజా బషీర్ ను అవుట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెర పడింది. తొలి ఇన్నింగ్స్ లో క్రాలే 79 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 218 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత గిల్(110), రోహిత్ శర్మ (103) సెంచరీలు చేయడంతో భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులు చేసింది.