కదిలిస్తే కన్నీళ్లే.. వయనాడ్​లో హృదయ విదారక పరిస్థితులు

కదిలిస్తే  కన్నీళ్లే.. వయనాడ్​లో హృదయ విదారక పరిస్థితులు
  • 190కి పెరిగిన మృతుల సంఖ్య..వందలాది మంది గల్లంతు
  • కూర్చున్న చోటే సజీవ సమాధి
  • కుర్చీలు, టేబుళ్లు, బెడ్ల కిందా మృతదేహాలు
  • బురదలో కూరుకుపోయిన ఇండ్లు
  • శిథిలాల కింద మరికొంత మంది
  • ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు

వయనాడ్: కేరళలోని వయనాడ్​లో ఎవరిని కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. కూలిన ఇండ్లు, మట్టి దిబ్బలు తొలగిస్తున్నా కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ముండకై గ్రామంలోని ఇండ్లపై కొండ చరియలు విరిగిపడటంతో కొందరు కూర్చున్న చోటే.. మరికొందరు బెడ్​పై పడుకుని ఉన్నప్పుడే చనిపోయారు. 

ప్రాణాలు కాపాడుకునేందుకు టేబుళ్లు.. కుర్చీల కింద దాక్కున్న వారు కూడా ప్రాణాలు వదిలారు. ఇది చూసిన రెస్క్యూ సిబ్బంది కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎటు చూసినా బురద.. బండరాళ్లు.. కూలిపోయిన ఇండ్లు.. కొట్టుకుపోయిన వాహనాలే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మృతదేహాలు బురదలో కూరుకుపోయాయి. మరికొన్ని డెడ్​బాడీలు విపత్తు ప్రాంతం నుంచి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న చలియార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నదిలో తేలుతున్నాయి. 

పెరుగుతున్న మృతుల సంఖ్య

కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి దాకా 190 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. 300 మంది ఆచూకీ లేకుండా పోయింది. 400 మంది వరకు గాయపడ్డారు. వీరికి వయనాడ్​లోని హాస్పిటల్స్​లో ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బురదతో పాటు శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. 

మెప్పాడి, ముండకై, చురల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మల, అట్టమాల, నూల్పూజ గ్రామాలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకడం లేదని సమాచారం. సుమారు వెయ్యి మందిని రెస్క్యూ చేసి కాపాడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. కాగా, సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని  సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.  

తాగునీటికి తీవ్ర ఇబ్బంది

వయనాడ్​లో సుమారు 90 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో సుమారు 10 వేల మంది ఉంటున్నారు. అక్కడే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి గాయపడిన వారికి ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. ఎటు చూసినా బురద పేరుకుపోవడంతో తాగేందుకు నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. సుమారు 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వమే బాధితుల వైద్య ఖర్చులతో పాటు భోజనం, వసతి ఏర్పాట్లు చేస్తున్నది.  

వయనాడ్​కు అండగా ఉండండి: రాహుల్

వయనాడ్​లో సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు కేంద్రం మరింత సహకారం అందించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కోరారు. లోక్​సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఆర్మీ ఎంతో కష్టపడుతున్నది. వయనాడ్ ప్రజలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి. ఐదేండ్లలో ఇలాంటి భారీ వరద రావడం రెండోసారి. కేరళలోని చాలా జిల్లాలకు పర్యావరణం పరంగా సమస్యలు ఎదురవుతున్నాయి.

 ఈ అంశాన్ని కేంద్రం పరిశీలించాలి. వరదల నియంత్రణకు శాశ్వత చర్యలు చేపట్టాలి. చనిపోయినవారికి అండగా ఉంటాం’’అని అన్నారు. వయనాడ్ చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నదని తెలిపారు. కాగా, వయనాడ్​లో విపత్తు సంభవించిన ప్రాంతాలను కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గురువారం సందర్శించనున్నారు. 

భారీ వర్షాలు కురిసే చాన్స్

రానున్న మరికొన్ని రోజుల పాటు కేరళలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవాళ్లు సేఫ్ ప్లేస్​లకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. వయనాడ్​తో పాటు ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్​గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.