
‘పుష్ప 2’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకుంది రష్మిక మందన్న. మరోవైపు ఆమె లీడ్ రోల్‌లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కుతోంది. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. సోమవారం టీజర్‌ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.
‘‘నయనం నయనం కలిసే తరుణం.. ఎదనం పరుగై పెరిగే వేగం.. నా కదిలే మనసుని అడిగా సాయం.. ఇక మీదట నువ్వే దానికి గమ్యం” అంటూ విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది. స్టోరీని రివీల్ చేయకుండా, కాలేజ్ హాస్టల్‌లో రష్మిక అడుగుపెట్టడం, హీరో దీక్షిత్ శెట్టితో తన రిలేషన్‌ను ఇందులో చూపించారు. ‘‘విసిరిన నవ్వులో వెలుగుని చూశా.. నవ్వాపితే పగలే చీకటి తెలుసా.. నీకని మనసుని రాసిచ్చేశా.. పడ్డానేమో ప్రేమలో బహుశా..” అంటూ విజయ్ వాయిస్‌లో కవిత్వం, ‘రేయి లోలోతుల సితార..’ అనే పాట బీజీఎం టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ‘ఇదేదో పికప్ లైన్ అయితే కాదుగా.. అస్సలు పడను’ అని టీజర్ చివరలో రష్మిక చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.