
H1B Visa: అమెరికాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు అమెరికాలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మంది టాప్ టెక్ కంపెనీలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ప్రఖ్యాత హెచ్1బీ వీసాలపై కొనసాగుతున్నారు. ఇయితే ప్రస్తుతం అమెరికాలోని ట్రంప్ సర్కార్ రాకతో పరిస్థితులు తలకిందులవుతున్నాయి. దీంతో ఉద్యోగ వీసాలపై పనిచేస్తున్న వ్యక్తుల్లో ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇమ్మిగ్రేషన్, వీసా పాలసీలను అత్యంత కఠినంగా మార్చేస్తున్నాయి. దీంతో అమెరికాలోని ఆపిల్, గూగుల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం ఆందోళనలో పడ్డాయి. హెచ్1బీ వీసాలపై పనిచేస్తున్న తమ ఉద్యోగులను అమెరికా వీడి అంతర్జాతీయ ప్రయాణాలను చేపట్టొద్దని ప్రస్తుతం హెచ్చరిస్తున్నాయి. ఎందుకంటే అమెరికాలోకి తిరిగి వచ్చే క్రమంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు కఠిన రూల్స్ కింద వారిని అనుమతించకపోవచ్చని ఒక వాషింగ్టన్ పోస్టు ప్రకారం వెల్లడైంది. అందుకే టెక్ కంపెనీలు ఉద్యోగులకు ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేస్తున్నాయి.
వాస్తవానికి ప్రతి ఏటా లాటరీ విధానంలో అమెరికా హెచ్1బీ వీసాలను జారీ చేస్తుంటుంది. వీటి సంఖ్య కేవలం 65వేలు మాత్రమే. వీటిలో అధిక భాగం టెక్ పరిశ్రమలో పనిచేసేందుకు వేళ్లే విదేశీయులు దక్కించుకుంటుంటారు. వీటిలో సింహ భాగం భారతీయులు పొందుతుండగా.. రెండవ స్థానంలో అత్యధికంగా వీసాలను పొందుతున్న దేశంగా చైనా నిలిచింది. దీని తర్వాత మూడో స్థానంలో కెనడా ఉంది. ఇలా వీసాలు పొందిన వ్యక్తుల్లో ఎక్కువ మంది టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా, ఆపిల్, మైక్సోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీల్లోనే పనిచేస్తుండటం గమనార్హం.
Also Read : యూఎస్ టారిఫ్స్, పుతిన్- కింమ్ జోలికి వెళ్లని ట్రంప్.. ఎందుకంటే..?
ప్రస్తుత పరిస్థితుల్లో దేశం వీడి వెళితే తిరిగి అమెరికాలోకి అడుగుపెట్టడం కష్టతరంగా మారవచ్చనే భయాలు పెరిగిపోతున్నాయి. దీంతో అమెరికాలోని భారతీయ కుటుంబాలు, ఉద్యోగులు స్వదేశానికి తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నట్లు వెల్లడైంది. వీటిలో ప్రధానంగా ఆందోళన కలిగిస్తున్న అంశం బర్త్ రైట్ సిటిజన్ షిప్ రూల్స్. ట్రంప్ ఆర్డర్ అమలులోకి వస్తే తమ పిల్లలు అటు అమెరికన్లుగా కాకుండా ఇటు ఇండియన్లుగా కాకుండా వారి గుర్తింపు గందరగోళంగా మారవచ్చనే భయాలు ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి.
అంటే కొత్త రూల్స్ అమలైతే హెచ్1బీ వీసాపై నివసిస్తున్న వ్యక్తులకు కొత్త చిక్కులు వస్తాయి. ఇది వాస్తవంగా అక్కడ నివసించటానికి కూడా అనేక అడ్డంకులను కలిగించవచ్చని కొందరు చెబుతున్నారు. దీంతో చాలా మంది విదేశీ ఉద్యోగులు ఎల్లప్పుడూ వారితో పాటు తమ డాక్యుమెంట్లను ఎల్లప్పుడూ క్యారీ చేస్తున్నట్లు తేలింది. పైగా అమెరికాలోని టెక్ పరిశ్రమ ప్రధానంగా విదేశీ నిపుణులపై ఆధాపడిన వేళ తమ ఉద్యోగులు ఇబ్బందుల్లో పడకుండా నివారించేందుకు సదరు సంస్థలు తమ టెక్కీలకు దేశం వీడి వెళ్లొద్దంటూ సూచిస్తున్నాయి.