
Infosys News: దేశంలోని టాప్ ఐటీ సేవల కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ రెండవ స్థానంలో నిలుస్తోంది. అయితే కంపెనీ యాజమాన్యం ఉద్యోగుల పట్ల, నియామాల విషయంలో పాటిస్తున్న కొన్ని పద్దతులు భారీగా వ్యతిరేకతను చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కంపెనీ కొన్ని వారాల కిందట తన మైసూరు క్యాంపస్ నుంచి వందల మంది ట్రైనీ ఫ్రెషర్లను ఇళ్లకు పంపించటం పెద్ద దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలోనే తాజాగా కంపెనీ మరింతమందిని తాజాగా ఇంటికి పంపించినట్లు వెల్లడైంది.
తాజాగా మార్చి 26న ఇన్ఫోసిస్ మరో 30-45 మంది ట్రైనీలను మైసూరు క్యాంపస్ నుంచి పరీక్షలో ఫెయిల్ అవ్వటంతో ఇంటికి పంపేసింది. అనేక నెలలు కష్టపడిన ట్రైనీలు అకస్మాత్తుగా పంపబడటంతో వస్తున్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఇన్ఫోసిస్ కొత్త ఆలోచనతో వచ్చింది. ఈ క్రమంలో తిరస్కరణకు గురైన ట్రైనీలకు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ రోల్ కింద రిక్రూట్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. పైగా దీని కింద 12 వారాల పాటు ట్రైనింగ్ కూడా అందించనున్నట్లు వెల్లడించింది.
వాస్తవానికి రెండున్నర ఏళ్లకు పైగా ఎదురుచూపుల తర్వాత ట్రైనింగ్ పొంది తిరస్కరణకు గురైన 350 మంది ఫ్రెషర్ల వివాదం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం కావటంతో ప్రస్తుతం ఇన్ఫోసిస్ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. అలాగే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్(BPM) కోర్సును ఎంపిక చేసుకునే ఫ్రెషర్లకు అయ్యే ట్రైనింగ్ ఖర్చులను కంపెనీ భరించనున్నట్లు స్పష్టం చేయటం కొంత ఊరటను కలిగించే అంశంగా ఉంది. ఇదే క్రమంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రభావితమైన ట్రైనీలకు ఒక నెల ఎక్స్ గ్రేషియా చెల్లింపును కూడా రిలీవింగ్ లెటర్ తో పాటు అందిస్తోంది.
అలాగే BPM మార్గాన్ని తీసుకోవడానికి ఇష్టపడని ట్రైనీలకు కంపెనీ మైసూరు నుంచి బెంగళూరుకు రవాణాతో పాటు వారు తమ స్వస్థలానికి చేరుకోవటానికి అయ్యే ప్రయాణ ఖర్చుల భత్యాన్ని ఏర్పాటు చేస్తోంది. అవసరమైతే ట్రైనీలు తమ నిష్క్రమణ తేదీ వరకు మైసూర్‌లోని ఉద్యోగి సంరక్షణ కేంద్రంలో వసతిని పొందవచ్చని వెల్లడించింది. క్యాంపస్ వీడాలనుకునే వారు మార్చి 27 లోపు దానికి సంబంధించిన వివరాలను పంచుకోవాలని కంపెనీ వెల్లడించింది.
ALSO READ : Gold Rates: ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు.. నేడు రూ.4,400 అప్, హైదరాబాదు రేట్లివే..
దీనికి ముందు ఫిబ్రవరి చివర్లో కర్ణాటక కార్మిక శాఖ ట్రైనీల తొలగింపులపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. ఆ సమయంలో అందుకున్న డాక్యుమెంటరీ ఆధారాలకు అనుగుణంగా కంపెనీ తొలగింపుల విషయంలో ఎలాంటి అక్రమాలు లేదా తప్పు పద్దతులను పాటించలేదని తేల్చింది. అందువల్ల వాటిని లేఆఫ్స్ గా పరిగణించటం కుదరదని తెలిపిసింది. అయితే కంపెనీ కూడా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించే క్రమంలో ట్రైనీలు వివిధ పరీక్షలను దాటాల్సి ఉంటుందని, వాటికి అనుగుణంగానే తొలగింపులను చేపట్టినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.