IT News: టీసీఎస్ నుంచి టెక్కీలకు రెండు శుభవార్తలు..! భయం వద్దన్న సీఈవో..

IT News: టీసీఎస్ నుంచి టెక్కీలకు రెండు శుభవార్తలు..! భయం వద్దన్న సీఈవో..

TCS Hiring: దేశీయ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ ఇటీవల తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం వేతన పెంపులను వాయిదా వేస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ టారిఫ్స్ ప్రభావం కారణంగా మారుతున్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ వ్యూహాత్మకంగా కంపెనీ ముందుకు సాగాలని నిర్ణయించింది.

ముందుగా కంపెనీ 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ దాదాపు లక్ష 10వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్స్ ప్రకటించిందని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లఖ్కడ్ వెల్లడించారు. వాస్తవానికి ఉద్యోగులకు వేతన పెంపులు లేని సమయంలో ప్రమోషన్స్ అందించటం కొంత ఊరటను ఇచ్చే అంశంగా ఉంది. ఇదే క్రమంలో కంపెనీ గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా 42వేల మంది టెక్ ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది.

కంపెనీ ప్రైమ్, డిజిటల్, నింజా కేటగిరీల కింద పరీక్ష ఆదారంగా ఫ్రెషర్లను హైర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది కేవలం డిజిటల్ హైరింగ్స్ మెుత్తం నియామకాల్లో 40 శాతంగా ఉన్నాయి. అయితే ఇవి అంతకు ముందు ఏడాది కేవలం 17 శాతంగా ఉండటం గమనార్హం. అలాగే ఇటీవలి త్రైమాసిక ఫలితాల సమయంలో కంపెనీ ప్రకటిస్తూ నాల్గవ క్వార్టర్లో ఉద్యోగుల అట్రిషన్ రేటు 13 శాతంగా ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Also Read : టూవీలర్లలో హీరో టాప్‌‌‌‌

కంపెనీని వీడుతున్న ఉద్యోగుల స్థానాలను భర్తీ చేయటంతో పాటు కొత్త అవసరాల కోసం ఉద్యోగుల నియామకం చేపట్టడం ముఖ్యమని చెప్పిన లఖ్కడ్ ఇదే క్రమంలో ఉద్యోగులకు ప్రమోషన్లు అందించటం వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందని కూడా అంటున్నారు. గడచిన ఆర్థిక సంవత్సరం కూడా కంపెనీ దాదాపు 42 వేల మంది ఫ్రెషర్లను హైర్ చేసుకోగా ఈ ఏడాది కూడా ఇదేస్థాయిలో నియామకాలు ఉండనున్నాయని వెల్లడించటం గమనార్హం. 

అయితే ట్రంప్ టారిఫ్స్ ఆందోళనలు కలిగిస్తున్నప్పటికీ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ సీఈవో కృతివాసన్ అభయహస్తం ఇచ్చారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో దాదాపు రూ.3లక్షల 35 కోట్ల విలువైన ఆర్డర్లు చేతిలో ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో కంపెనీ ఆదాయాలపై ఆందోళనలు అక్కర్లేదని స్టేక్ హోల్డర్లకు వెల్లడించారు. అయితే కొందరు క్లయింట్లు వ్యయ నియంత్రణలో భాగంగా ప్రస్తుతం తమ ప్రాజెక్టులను వాయిదా వేసుకోవటం లేదా ఆలస్యం చేయటం వంటి ప్రవర్తన కనిపించవచ్చని అన్నారు. ట్రంప్ టారిఫ్స్ ప్రభావం బ్యాంకింగ్, ఆర్థిక సేవలు వంటి రంగాలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని క-ృతివాసన్ అభిప్రాయపడ్డారు. అయితే మధ్య కాలంలో ఇవి సర్థుమణికే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.