బెంగళూరు టెకీ కేసులో కీలక పరిణామం.. అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా అరెస్ట్..

బెంగళూరు టెకీ కేసులో కీలక పరిణామం.. అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా అరెస్ట్..

ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో ఆదివారం(డిసెంబర్ 15, 2024) కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న అతుల్ భార్య నిఖితా సింఘానియాను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నిఖితతో పాటు ఆమె తల్లిని, సోదరుడిని కూడా అతుల్ సుభాష్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని గురుగ్రాంలో నిఖిత, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్ యూపీలోని అలహాబాద్లో పోలీసులకు పట్టుబడ్డారు.

అతుల్ సుభాష్ పై పెట్టిన కేసులు వాపస్ తీసుకోవాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని, తన కొడుకును చూడాలంటే 30 లక్షలు ఇవ్వాలని నిఖిత, ఆమె కుటుంబం అతుల్ను వేధింపులకు గురిచేసింది. ఈ కుటుంబం మొత్త కలిసి ఈ టెకీని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు  తాగించారు. నిందితులను అరెస్ట్ చేయడంలో బెంగళూరు పోలీసులు యూపీ పోలీసుల సాయం తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే..
భార్య వేధింపుల కారణంగా బెంగళూరుకు చెందిన టెకీ అతుల్ సుభాష్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యుల వేధింపులతోనే అతుల్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ‘రకరకాల కేసులు పెట్టి అతుల్​ను బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్​కు 40సార్లు తిప్పించారని, తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని కన్నీటిపర్యంతమయ్యారు. ‘మా కొడుకును ఎంతో వేధించారు. అన్నీ భరించాడు. లోలోపలే కుమిలిపోయేవాడు. మేమంతా ఇబ్బందులు ఎదుర్కొన్నం”అని అతుల్​ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యామిలీ కోర్టు కూడా చట్టాన్ని అనుసరించట్లేదని, కరెప్ట్ అయిందని తనతో అతుల్ చెప్పినట్లు ఆయన తండ్రి గుర్తు చేశారు.

Also Read :- హైదరాబాద్ బోయిన్పల్లిలోని పెంట్​హౌజ్లో ఈ పనులేంటి..?

హైకోర్టు, సుప్రీంకోర్టు గైడ్​లైన్స్ పాటించకుండా తనను బెంగళూరు నుంచి యూపీకి ఒకటి తర్వాత మరొక కేసు పెట్టి తిప్పిస్తున్నారని కొడుకు తీవ్ర వేదన చెందినట్లు పేర్కొన్నారు. ‘‘నా సోదరుడి భార్య అతడి నుంచి విడిపోయిన 8 నెలల తర్వాత విడాకుల కేసుతో పాటు, ఎన్ని వీలైతే అన్ని రకాల కేసులు మా అందరిపై పెట్టింది. దేశంలో చట్టాలన్నీ మహిళలకు అనుకూలంగా ఉన్నాయి. వాటిపై అతుల్ పోరాడాడు. చివరకు అతడే మాకు లేకుండా పోయాడు. డబ్బులిస్తే అనుకూలంగా తీర్పిస్తానని చెప్పినట్లు అతుల్ ఆరోపించిన జడ్జి విషయంలోనూ న్యాయం కోసం రాష్ట్రపతిదాకా పోతం”అని అతుల్ సోదరుడు వికాస్  కుమార్ వెల్లడించారు. కాగా, వికాస్ ఫిర్యాదుతో పోలీసులు నిఖిత కుటుంబ సభ్యులు నలుగురిపై కేసు నమోదు చేశారు.

కొడుకును చూసేందుకూ డబ్బులు ఇవ్వాల్సిందే.. 
గత సోమవారం ఉదయం అతుల్ ఆత్మహత్యకు ముందు తీస్కున్న గంటన్నరపాటున్న సెల్ఫీ వీడియో, 24 పేజీల సూసైడ్ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘2019లో నిఖితతో పెండ్లయింది. 2020లో బాబు పుట్టాడు. నిఖిత కుటుంబ సభ్యులు నానుంచి లక్షలాది రూపాయలు కాజేశారు. డబ్బులివ్వనందుకు 2021లో నిఖిత బాబును తీస్కొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆపై కేసులు పెట్టింది. ఆమె తండ్రి జబ్బుపడి చనిపోతే, నేనే కారణమని కేసు పెట్టింది. సెటిల్ మెంట్ కోసం రూ.కోటి డిమాండ్ చేసింది” అని సెల్ఫీ వీడియోలో అతుల్ పేర్కొన్నాడు. బాబును చూడాలని అడిగితే 10 లక్షలిస్తేనే చూపిస్తానని తన భార్య బ్లాక్ మెయిల్ చేసేదని ఆవేదన వ్యక్తం చేశాడు.