భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. చిన్న పిల్లలను వదిలేసి ఆత్మహత్య చేసుకున్నారు..

భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. చిన్న పిల్లలను వదిలేసి ఆత్మహత్య చేసుకున్నారు..

సంగారెడ్డి జిల్లా: భార్యాభర్తలిద్దరూ బాగా చదువుకున్న వ్యక్తులే. తెలివితేటలతో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ మంచిగా సంపాదించుకుంటున్నారు. కుటుంబ కలహాలు పచ్చని ఆ సంసారాన్ని శోకసంద్రంలోకి నెట్టేశాయి. ఇద్దరి పిల్లలకు తల్లిని, తండ్రిని దూరం చేశాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా ఆ సాఫ్ట్వేర్ కపుల్ ఆత్మహత్యకు పాల్పడింది. అమీన్ పూర్ లోని ఇంట్లో ఉరి వేసుకుని ఆ దంపతులిద్దరూ చనిపోయారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. సందీప్, కీర్తి ఇద్దరూ హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. ఇద్దరికీ మంచి జీతాలే వస్తున్నాయి. ఇద్దరూ పని చేసే కంపెనీలు MNC కంపెనీల్లోనే. ఇద్దరిదీ వరంగల్ జిల్లానే.. ఆత్మహత్య కారణాలు ఏంటనేది స్పష్టంగా తెలియరాలేదు. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

సందీప్, కీర్తి కుటుంబ సభ్యులు, బంధువులను విచారిస్తేనే.. కారణం ఏంటనే విషయం స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ జంటకు ఐదేళ్ల క్రితం పెళ్లయ్యింది. మూడేళ్లు కుమార్తె, 14 నెలల కొడుకు ఉన్నారు. పిల్లలను వదిలేసి.. వీళ్లు ఆత్మహత్య చేసుకోవటంతో.. ఆ పిల్లలను చూసినోళ్లను కంటతడి పెడుతున్నారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంధం కొమ్ములో సందీప్, కీర్తి ఉంటున్నారు. పోస్ట్ మార్టం అనంతరం వరంగల్ జిల్లాలోని సొంతూరికి సందీప్, కీర్తి మృతదేహాలను తరలించనున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.