Cyber Crime: సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆ ఉచ్చులో పడి అమాయకులు మోసపోతున్నారు. రోజుకో కొత్త రకం మోసంతో నేరగాళ్లు వల వేస్తున్నారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు అనుకునేవాళ్ల ఆశల్ని సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా మరొక సైబర్ స్కామ్ తెరమీదకు వచ్చింది. వాట్సాప్‌లో తమ సీఈవోల డీపీలను ఉపయోగించి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నుంచి సుమారుగా 9 లక్షల రూపాయలను కొల్లగొట్టారు.
మాదాపూర్‌కు చెందిన ఒక సంస్థలో పనిచేస్తున్న 32 ఏళ్ల సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అభిలాష్‌కు తెలియని నంబర్ నుండి వాట్సాప్ టెక్స్ట్ వచ్చింది. అది ఓపెన్ చేస్తే అందులో డీపీ తను పనిచేసే సీఈవోది ఉంది. దీంతో అభిలాష్ ఆ టెక్స్ట్ లో ఉన్న లింకును క్లిక్ చేసి క్రెడిట్ కార్డుల నుంచి ఉపయోగించి రూ. 4.95 లక్షలు వెచ్చించాడు. అనంతరం అటు వైపు నుంచి సమాధానం రాకపోవడంతో తన సీఈవోకు ఫోన్ చేశాడు. దీంతో తాను మోసపోయానని అభిలాష్ గ్రహించాడు.
సరిగ్గా ఇలాంటి ఫిర్యాదునే డల్లాస్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ అనురూప్ గౌరవ్ పోలీసులకు చేశాడు. మార్చి మొదటి వారంలో వాట్సాప్ టెక్స్ట్ వచ్చిందని, అది ఓపెన్ చేస్తే అందులో డీపీ తన కంపెనీ సీఈవోది ఉందని అనురూప్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. రెండు కేసుల్లోనూ బాధితులు వారికి తమ కంపెనీ సీఈవో దగ్గరినుంచే వాట్సాప్ టెక్స్ట్ వచ్చిందని అనుకున్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి), 66-డి సెక్షన్లు 420 కింద పోలీసులు ఈ వారం వేర్వేరు చీటింగ్ కేసులను నమోదు చేశారు.