బిల్డింగ్ రెడీ అయినా.. కరెంట్​ ఇయ్యలే ఐటీఐకి మోక్షమెప్పుడు?

 బిల్డింగ్ రెడీ అయినా.. కరెంట్​ ఇయ్యలే ఐటీఐకి మోక్షమెప్పుడు?
  • ఏడేండ్ల కింద జిల్లాకు స్పెషల్​ ఐటీఐ మంజూరు 
  • ఏడాదిన్నర కింద పూర్తయినా అడ్మిషన్స్​ స్టార్ట్​ చేయలేని పరిస్థితి
  • ప్రహరీ, కరెంట్ ​సౌకర్యం లేదంటున్న కాలేజీ ప్రిన్సిపాల్
  • పీఆర్​ ఇంజినీర్లు, కాంట్రాక్టర్​ పని తీరుపై పలువురి అసహనం 
  • వెంటనే వాడుకలోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గిరిజన విద్యార్థులకుసాంకేతిక విద్య అందని ద్రాక్షగా మారింది. జిల్లాలో రూ.5.5కోట్లతో కట్టిన స్పెషల్​ఐటీఐ బిల్డింగ్​ను నిరుపయోగంగా పెట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని స్టూడెంట్స్​ నక్సల్స్​​ వైపు ఆకర్షించకుండా  ఏడేండ్ల కిందట జిల్లాకు కేంద్రం స్పెషల్​ ఐటీఐని శాంక్షన్​ చేసింది. 

గిరిజన పిల్లలకు టెన్నికల్​ ఎడ్యుకేషన్​ పూర్తిస్థాయిలో ఫ్రీగా అందించేందుకు స్పెషల్​ ఐటీఐ బిల్డింగ్​తో పాటు హాస్టల్​కు రూ. 5.5కోట్లను కేంద్రం రిలీజ్​ చేసింది. చుంచుపల్లి మండలంలో బిల్డింగ్​ నిర్మాణ పనులను పంచాయతీ రాజ్​ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. ఏడాదిన్నర కిందట బిల్డింగ్​ పూర్తయినా ఇప్పటి వరకు అందుబాటులోకి తేలేదు. 

ప్రహరీ, కరెంట్​ లేకనే.. 

స్పెషల్​ ఐటీఐ కాలేజ్​ బిల్డింగ్​తో పాటు ల్యాబ్​లు, హాస్టల్​ భవనాలను నిర్మించిన పంచాయతీరాజ్​ ఆఫీసర్లు కాంపౌండ్​ వాల్​ నిర్మాణాన్ని మర్చిపోయారు. కరెంట్​ సప్లై ఇవ్వలేదు. హాస్టల్​ బిల్డింగ్​ ముందు కందకాలు పూడ్చలేదు.  కానీ బిల్డింగ్​ పూర్తి అయినట్టుగా చెబుతూ హ్యాండోవర్​ చేసుకోవాలని కొత్తగూడెంలోని ఐటీఐ ప్రిన్సిపాల్​పై ఒత్తిడి తెచ్చారు. పనులన్నీ పూర్తి  చేస్తేనే హ్యాండోవర్​ చేసుకుంటానని ప్రిన్సిపాల్​ ఖరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో కాలం గడుస్తోంది తప్ప క్లాసులు నిర్వహించేందుకు బిల్డింగ్​ అందుబాటులోకి రావడం లేదు. 

Also Read : కాజీపేట్​లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై క్లారిటీ ఇవ్వండి..కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ కడియం కావ్య

ఫలితంగా కోట్లతో నిర్మించిన బిల్డింగ్​ లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. నిత్యం మందుబాబులు అక్కడ సిట్టింగ్​వేస్తున్నారు. ఈ క్రమంలో వెంటనే పెండింగ్​ పనులన్నీ పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. ఇప్పుడు పనులు చేస్తేనే నెక్స్ట్​అడ్మిషన్లు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాగా అసంపూర్తి నిర్మాణంతో పాటు పోస్టుల శాంక్షన్ ​కోసం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.  

బిల్డింగ్​లను హ్యాండోవర్​ చేసుకోవట్లే..

ఐటీఐ కాలేజీ బిల్డింగ్​తో పాటు హాస్టల్​ భవనాల నిర్మాణాలను పూర్తి చేశారు. బిల్డింగ్​లను హ్యాండోవర్​ చేసుకోవాలని కొత్తగూడెం ఐటీఐ ప్రిన్సిపాల్​కు లేఖ రాశాం. కానీ వారు ముందుకు రావడం లేదు. - శ్రీనివాసరావు, పీఆర్​ ఈఈ

అసంపూర్తి పనులతో అప్పగిస్తే ఎలా..? 

ఐటీఐ బిల్డింగ్​అసంపూర్తిగా ఉంది. ఆ పనులను అలాగే ఉంచి తాము ఎలా హ్యాండోవర్​ చేసుకోవాలి. కాంపౌండ్​ వాల్​తో పాటు కరెంట్​ సప్లై లేదు. పోస్టుల శాంక్షన్​ విషయాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్​ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లాం. ప్రభుత్వం పోస్టులను శాంక్షన్​ చేస్తే అడ్మిషన్లు స్టార్ట్​ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. మిషనరీ, ఫర్నీచర్​ కోసం దాదాపు రూ.1.50కోట్లను కేంద్రం ఇచ్చింది. వెంటనే పనుల కంప్లీట్ ​చేయాలి.    - రమేశ్, ఐటీఐ ప్రిన్సిపాల్, భద్రాద్రికొత్తగూడెం