హైదరాబాద్‌ టూ తిరుపతి.. ఉదయం 5.30కు వెళ్లాల్సిన విమానం.. కదలనే లేదు..!

హైదరాబాద్‌ టూ తిరుపతి.. ఉదయం 5.30కు వెళ్లాల్సిన విమానం.. కదలనే లేదు..!

శంషాబాద్: హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 5:30 గంటలకు బయల్దేరాల్సిన విమానం గంటలు గడుస్తున్నా కదలకపోవడం, ప్రత్యామ్నయం ఏంటో చెప్పకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో ప్రయాణికులకు సమాచారం ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. 4  గంటలుగా ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.

ఎయిర్‌వేస్‌ తీరుపై తిరుమల వెళ్లే ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం స్లాట్ బుక్ చేసుకున్నామని, దర్శన సమయం దాటిపోతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి దర్శనానికి ఎక్కువ సమయమే పడుతున్నట్లు సమాచారం. తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి.

మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకోవడానికి భక్తులకు రెండు కళ్లు చాలలేదు. వాహన మండపం నుంచి సూర్యప్రభ వాహనం ప్రారంభమైంది. తిరుమాడ వీధుల్లో వాయువ్య దిశగా వాహనాన్ని అర్చకులు నిలిపారు. మంగళవారం ఉదయం 6.44 గంటలకు సూర్య కిరణాలు స్వామివారి పాదాలకు తాకిన వెంటనే అర్చకులు హారతులు, నైవేద్యాలు సమర్పించి వాహన సేవను ఆరంభించారు.

పరమ పవిత్రమైన రథ సప్తమి రోజున సూర్యప్రభ వాహనంపై సప్తగిరీశుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులతో మాడ వీధులు కిటకిటలాడాయి. మంగళవారం స్వామి వారిని మాడ వీధుల్లో దర్శించుకున్న భక్తులు బుధవారం ఆ దేవదేవుణ్ణి దర్శించుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో.. తిరుమలలో దర్శనానికి గంటల తరబడి సమయం పడుతుంది.