ప్రధాని మోడీ విమానంలో సాంకేతిక లోపం.. తప్పిన పెను ప్రమాదం

ప్రధాని మోడీ విమానంలో సాంకేతిక లోపం.. తప్పిన పెను ప్రమాదం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆయన ఢిల్లీ తిరుగు ప్రయాణం దాదాపు గంట పాటు ఆలస్యమైంది. విమానంలో సమస్య పరిష్కారం కాకపోవడంతో మరో ఫ్లైట్ లో మోడీ తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పైలెట్ల అప్రమత్తతో ప్రధాని మోడీకి ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే.. ఆదివాసీ వీరుడు బిర్సా ముండా జయంతి (నవంబర్ 15) సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ గౌరవ్ దివస్‌ వేడుకల్లో పాల్గొనడంతో పాటు.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారంలో పాల్గొనేందుకు 2024, నవంబర్ 15న ప్రధాని మోడీ జార్ఖండ్‎లో పర్యటించారు. 

ఈ పర్యటన అనంతరం ప్రధాని మోడీ తిరిగి ఢిల్లీ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్‎కు ముందుగానే ఫైలట్లు మోడీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో విమానాన్ని జార్ఖండ్‎లోని డియోఘర్ ఎయిర్ పోర్టులో నిలిపారు. సిబ్బంది సాంకేతిక సమస్యను ముందుగానే పసిగట్టడంతో ప్రధాని మోడీకి పెను ప్రమాదం తప్పింది. 

వెంటనే అప్రమత్తమైన అధికారులు.. మోడీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్‎కు గల కారణం ఏంటన్నది ప్రస్తుతానికి తెలియదని ప్రధాని భద్రతాధికారులు వెల్లడించారు. కాగా, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ రెండు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.