LRS :ఎల్ఆర్ఎస్ పోర్టల్​లో టెక్నికల్ గా ఉన్న సమస్యలు ఇవే..

LRS :ఎల్ఆర్ఎస్ పోర్టల్​లో టెక్నికల్ గా ఉన్న సమస్యలు ఇవే..

కరీంనగర్, వెలుగు:ప్లాట్ల రెగ్యులరైజేషన్  కోసం ఫీజుల చెల్లింపు ప్రారంభమై నెల రోజులు దాటినా ఎల్ఆర్ఎస్  పోర్టల్ లో  టెక్నికల్  సమస్యలు పరిష్కారం కావడం లేదు. పైగా కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఎలాంటి వివాదం లేకున్నా, నిషేధిత భూముల జాబితాలో, చెరువు శిఖాల్లో లేకపోయినా అకారణంగా ప్రొహిబిటెడ్/ఎఫ్టీఎల్ గా పేర్కొన్న ప్లాట్లకు ఇంకా ఫీజు జనరేట్  కావడం లేదు. ఎల్ఆర్ఎస్  అప్లికేషన్లు ఎల్ 1 నుంచి ఎల్ 2కు, ఎల్ 2 నుంచి ఎల్ 3కి ట్రాన్స్ ఫర్  అవడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో అప్లికేషన్లను అప్రూవల్  చేయడంలో ఆఫీసర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

టెక్నికల్ గా అనేక సమస్యలు.. 

కొందరు దరఖాస్తుదారులు అప్లికేషన్ సమయంలో పేపర్లను అప్ లోడ్ చేయలేదు. దీంతో ఇప్పుడు షార్ట్ ఫాల్ చూపిస్తోంది. అలాంటి వారు పేపర్లు అప్ లోడ్  చేశాక  ఎల్-1 ఆఫీసర్ కు వెళ్లాల్సి ఉంటుంది. సదరు ఆఫీసర్  అప్రూవ్  చేశాక ఎల్ 2 ఆఫీసర్ కు వెళ్లాలి. కానీ ఆ అప్లికేషన్ వచ్చినట్లే వచ్చి మళ్లీ ఎల్ 1 ఆఫీసర్ కు రిటర్న్  పోతుంది.  

ఎల్ఆర్ఎస్  ఫీజు చెల్లించాక ఎల్ 1 ఆఫీసర్  ఫీల్డ్  విజిట్  చేసి అప్రూవ్  చేయాల్సి ఉంటుంది. ఫీల్డ్  విజిట్  చేసే ముందు అప్లికేషన్  వివరాలు పరిశీలిద్దామంటే  కొన్ని అప్లికేషన్లు కనిపించడం లేదు.  అలాగే ఎల్ 1 తర్వాత ఎల్-2 ఆఫీసర్ కు, అక్కడి నుంచి ఎల్-3కి వెళ్లాల్సి ఉండగా.. కింది ఆఫీసర్ లాగిన్ కు వచ్చి చేరుతున్నాయి. 

చాలా మంది ప్లాట్ల ఓనర్లు ఇంటర్నెట్  సెంటర్లు, మీ సేవా కేంద్రాల నిర్వాహకుల సాయంతో ఎల్ఆర్ఎస్ కు అప్లై చేశారు. ఈ క్రమంలో కమ్యూనికేషన్  గ్యాప్  వల్ల కొందరు ఊరు, మండలం పేర్లు తప్పుగా ఎంట్రీ చేశారు. ప్రస్తుతం ప్లాట్ల నంబర్లు తప్పుగా పడితే మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఊరు, మండలం పేర్లు మార్చుకునే అవకాశం లేదు.

జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో లతకు 252 చదరపు మీటర్ల ప్లాట్  ఉంది. ఈ ప్లాట్ రెగ్యులరైజేషన్  కోసం ఇటీవల 25 శాతం రిబేట్ తో రూ.45,935 ఫీజు చెల్లించారు. మూడు రోజుల కింద మున్సిపల్  ఆఫీసర్లు ఫోన్  చేసి ఫీల్డ్  విజిట్ కు వస్తామని చెప్పారు. మరుసటి రోజు దరఖాస్తుదారు ఫోన్  చేస్తే తమ లాగిన్ లో ఆ ఫైల్  చూపించడం లేదని చెప్పారు. దీంతో ఆందోళనకు గురైన లత కుటుంబసభ్యులు రెండు రోజులుగా పనులు మానుకుని ఆఫీస్  చుట్టూ తిరుగుతున్నారు. ఆఫీసర్లు మాత్రం  టెక్నికల్  ప్రాబ్లమ్  అని చెపుతూ ఫీల్డ్  విజిట్ కు రావడం లేదు. 

వరంగల్ నగరంలోని పైడిపల్లిలోని 1245 సర్వే నంబర్  ఐజీఆర్ఎస్  రికార్డుల ప్రకారం ప్రొహిబిటెడ్  జాబితాలో లేదు. కానీ, ఈ సర్వే నంబర్ లోని 5,6,9 ప్లాట్లకు ఫీజు జనరేట్  అయి ఫీజు చెల్లించగా.. మిగతా ప్లాట్లు ఎల్ఆర్ఎస్  పోర్టల్ లో ప్రొహిబిటెడ్, ఎఫ్టీఎల్ గా కనిపిస్తున్నాయి. ఈ సర్వే నంబర్  ప్రొహిబిటెడ్ లో లేదని వరంగల్ సబ్  రిజిస్ట్రార్ ధ్రువీకరిస్తూ ప్లాట్ల ఓనర్లకు ఎన్వోసీ కూడా జారీ చేశారు. ఆ ఎన్వోసీని కార్పొరేషన్  ఆఫీసులో ఇవ్వడంతోపాటు పోర్టల్ లో అప్ లోడ్  చేసి 10 రోజులైనా ఇప్పటి వరకు ఫీజు ఇంటిమేషన్  లెటర్  జనరేట్  కాలేదు. ఇంకా ప్రొహిబిటెడ్ గానే చూపిస్తోంది. ఇదేంటని అడిగితే సమస్య పోర్టల్  వల్లేనని టౌన్  ప్లానింగ్  ఆఫీసర్లు చెబుతున్నారు.