మణుగూరు, తెలుగు: భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్)లో టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రెండో యూనిట్ లో సమస్య తలెత్తడంతో షట్ డౌన్ చేసి మరమ్మతులు చేపడుతుండగా.. 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచింది. మణుగూరు, పినపాక మండలాల సరిహద్దుల్లో 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నాలుగు యూనిట్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. పర్సంటేజీల కోసం సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించకుండా.. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ను నిర్మిస్తున్నారంటూ మొదటి నుంచి పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
దీంతో ఎన్జీటీకి ఫిర్యాదు చేయడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులు ప్లాంట్ నిర్మాణాన్ని ఏడాది కిందట నిలిపివేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఎన్జీటీ నుంచి పర్మిషన్లు తీసుకొని ప్లాంటు నిర్మాణాన్ని పూర్తిచేసింది. నాలుగు యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. నెలరోజుల కిందట మొదటి యూనిట్లో షార్ట్ సర్క్యూట్ తో జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయినప్పుడు విద్యుత్ ఉత్పత్తి నిలిచింది. ప్లాంట్ పై పిడుగు పడడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు తప్పుడు సమాచారం అందించారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు చేయించి టెక్నికల్ సమస్యతో జరిగిందని నిర్ధారించింది. మొదటి యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ పనులు కొనసాగుతుండగానే.. మంగళవారం రెండో యూనిట్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తి విద్యుత్ ఉత్పత్తి నిలిచింది. సీఈ బిచ్చన్న ఆధ్వర్యంలో ఇంజనీర్లు మరమ్మతు పనులు చేస్తున్నారు. నాణ్యత లేని పరికరాల వాడకంతోనే తరచూ సమస్యలు తలెత్తుతుండగా.. ఉత్పత్తికి ఆగిపోతుందని పలువురు ఆరోపిస్తున్నారు. కేటీపీఎస్ లో వినియోగించిన సూపర్ క్రిటికల్ టెక్నాలజీనే బీటీపీఎస్ కు వాడాలని స్థానికులు కోరుతున్నారు.