జెన్‌‌‌‌‌‌‌‌కో ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో టెక్నికల్ సమస్యలు సాధారణమే

గోదావరిఖని, వెలుగు : రామగుండం పట్టణంలోని జెన్‌‌‌‌‌‌‌‌కో ప్లాంట్‌‌‌‌‌‌‌‌ జీవిత కాలం 25 ఏళ్లు మాత్రమే అయినా 50 ఏళ్లకుపైగా పూర్తి చేసుకున్నదని, దీంతో ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో సాంకేతిక సమస్యలు రావడం సాధారణమే అని జెన్‌‌‌‌‌‌‌‌కో డైరెక్టర్ల బృందం వెల్లడించింది. మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ విద్యుత్‌‌‌‌‌‌‌‌  సౌధ నుంచి థర్మల్‌‌‌‌‌‌‌‌, ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌, సివిల్‌‌‌‌‌‌‌‌, హైడల్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లకు చెందిన డైరెక్టర్లు లక్ష్మయ్య, సచ్చిదానందం, అజయ్‌‌‌‌‌‌‌‌, వెంకట రాజంతో పాటు చీఫ్​ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ (జనరేషన్‌‌‌‌‌‌‌‌) రత్నాకర్‌‌‌‌‌‌‌‌రావు రామగుండం జెన్‌‌‌‌‌‌‌‌ కో ప్లాంట్‌‌‌‌‌‌‌‌లోని కీలక విభాగాలైన మిల్స్‌‌‌‌‌‌‌‌, బాయిలర్‌‌‌‌‌‌‌‌, టర్బైన్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం ప్లాంట్‌‌‌‌‌‌‌‌ కాలం చెల్లినది కావడంతో ఈ కేంద్రం రెనొవేషన్‌‌‌‌‌‌‌‌కు నిధులు కేటాయించే పరిస్థితి లేదన్నారు. అలాగే మిల్స్‌‌‌‌‌‌‌‌, బాయిలర్‌‌‌‌‌‌‌‌  విభాగాల్లో వస్తున్న సమస్యలను పరిష్కరించేందుకు విడి భాగాల లభ్యత కష్టంగా మారిందని తెలిపారు. ఈనెల 12వ తేదీ నుంచి యాన్యువల్‌‌‌‌‌‌‌‌ మెయింటనెన్స్‌‌‌‌‌‌‌‌లో భాగంగా షట్‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌  చేసిన ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను అక్టోబర్‌‌‌‌‌‌‌‌ మొదటి వారంలో తిరిగి ఉత్పత్తి దశలోకి తీసుకువస్తామని చెప్పారు.

 వారి వెంట బి‒థర్మల్‌‌‌‌‌‌‌‌ కేంద్రం సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌  పి.విజేందర్‌‌‌‌‌‌‌‌, డీఈ శ్రీనివాసరావు, శశికాంత్‌‌‌‌ ‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌, రవికుమార్‌‌‌‌  తదితరులు ఉన్నారు. కాగా, రామగుండం పట్టణంలోని 62.5 మెగావాట్ల జెన్‌‌‌‌‌‌‌‌ కో ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను అధునాతన టెక్నాలజీతో 600 లేదా 800 మెగావాట్లతో విస్తరించాలని కార్మిక నాయకులు కౌశిక హరి, కార్పొరేటర్లు కన్నూరి సతీశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, కౌశిక లత, లీడర్లు బొడ్డుపెల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, మీర్జా సలీంబేగ్‌‌‌‌‌‌‌‌, గంగాప్రసాద్‌‌‌‌  డైరెక్టర్లకు వినతిపత్రం అందజేశారు. ప్లాంట్‌‌‌‌‌‌‌‌  రిపేర్లకు తక్షణమే రూ.55 కోట్లు మంజూరు చేయాలని వారు కోరారు.