హైదరాబాద్, వెలుగు: సిటీకి చెందిన పెయింట్స్ తయారీ కంపెనీ టెక్నో పెయింట్స్ మరో మూడు ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, చిత్తూరుతోపాటు మధ్యప్రదేశ్‌లోని కట్నీ వద్ద ఇవి రానున్నాయి. ఈ కేంద్రాల్లో డ్రై సిమెంట్ పుట్టీ, టెక్స్చర్స్, ప్రైమర్స్, ఎమల్షన్స్ తయారు చేస్తారు. కొత్త ప్లాంట్లను ఈ ఏడాదే ప్రారంభించాలన్నది కంపెనీ ఆలోచన. మొదటిదశలో ఒక్కొక్క ప్లాంటు వార్షిక సామర్థ్యం 30 వేల మెట్రిక్ టన్నులు ఉంటుందని టెక్నో పెయింట్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఫార్చూన్ గ్రూప్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వీటి నిర్మాణానికి రూ.46 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నామని, లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు ఒప్పుకున్నాయని వెల్లడించారు.
కంపెనీకి ఏపీలో ఒకటి, తెలంగాణలో మూడు ప్లాంట్లు ఉండగా, వీటి వార్షిక సామర్థ్యం 2,50,000 మెట్రిక్ టన్నులని చెప్పారు. 2023–-24లో దేశవ్యాప్తంగా రిటైల్‌లో విస్తరించాలని టెక్నో పెయింట్స్ నిర్ణయించింది. ఇందులో భాగంగా కలర్ బ్యాంక్స్ టెక్నాలజీని పరిచయం చేస్తోంది. వినియోగదారుడు కోరుకున్న రంగును వెంటనే అందించేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఎంఎన్‌సీలు మాత్రమే కలర్ బ్యాంక్స్‌ను ఉపయోగిస్తున్నాయని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సాల్వెంట్ ఆధారిత ఎనామెల్ పెయింట్ల తయారీని కూడా కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది. ఇటలీకి చెందిన రియాల్టో కలర్స్ భాగస్వామ్యంతో స్పెషల్ టెక్స్చర్స్ను, ఫినిషెస్‌ను సైతం ఉత్పత్తి చేస్తోంది. 2022–-23లో కంపెనీ 100 శాతం వృద్ధి సాధించింది. భారత పెయింట్స్, కోటింగ్స్ మార్కెట్ విలువ ఈ ఏడాది రూ.62,689 కోట్లకు చేరుతుందని అంచనా. 2023-–28 మధ్య ఏటా 7 శాతం వృద్ధి చెందుతుందని శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.