సాంకేతిక పురోగతే దేశాభివృద్ధికి చిహ్నం

టెక్నాలజీ పరంగా ప్రపంచం ఎంతో పురోగతిని సాధించింది. మనదేశం కూడా సాంకేతికంగా ప్రగతి మార్గంలో వెళ్తోంది. న్యూక్లియర్​ క్లబ్​లో 6వ దేశంగా స్థానం సంపాదించింది. ఇందులో భాగంగానే టెక్నాలజీ అండ్ డెవలప్ మెంట్ బోర్డు సైన్స్​ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహకారంతో జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. యువతలో సైన్స్ అండ్ టెక్నాలజీ స్ఫూర్తిని నింపే  క్రమంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి సంబంధిత రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని సత్కరిస్తోంది. ఏటా ఒక థీమ్​తో దేశ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలన్నీ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ.. వివిధ శాస్త్రీయ అంశాలపై ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహిస్తున్నాయి. దీం​తో పాటు ప్రదర్శనలు, వర్క్ షాప్స్, సెమినార్స్, గెస్ట్ లెక్చర్స్  ఏర్పాటు చేస్తున్నారు. 

అణు పరీక్షలు జరిగిన తేదీనే..

భారత సార్వభౌమత్వ పరిరక్షణకు అణు సామర్థ్యం పెంచుకోవడం అత్యంత అవసరమన్న నిర్ణయానికి వచ్చిన సర్కారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సాహసోపేతమైన నిర్ణయంతో రాజస్థాన్​లోని థార్​ ఎడారి ప్రాంతంలోని జైసల్మేర్​ జిల్లాలో గల పోఖ్రాన్​లో 1974 మే 18న మొదటి అణ్వస్త్ర పరీక్ష జరిపింది. దీన్ని ఆపరేషన్​ స్మైలింగ్​ బుద్ధ, పోఖ్రాన్​–1గా పిలుస్తారు. తర్వాత  సాంకేతికాభివృద్ధిని ప్రోత్సహించడానికి చట్టబద్ధమైన సంస్థగా  టెక్నాలజీ అండ్ డెవలప్​మెంట్ బోర్డును కేంద్రప్రభుత్వం 1996లో ఏర్పాటు చేసింది. పోఖ్రాన్​– 2 1998 మే 11న భారత్​ 5 అణ్వస్త్ర పరీక్షల శ్రేణిలో మొదటిది. దీన్ని రాజస్థాన్​ పోఖ్రాన్​లో నిర్వహించారు. అప్పటి ప్రధాని వాజ్​పెయ్​, ఏరో స్పేస్ ఇంజనీర్ ఏపీజే అబ్దుల్​ కలాం సారథ్యంలో ఐదు అణు పరీక్షలు జరిగాయి. ఆపరేషన్​ శక్తి 1 లేదా పోఖ్రాన్​ 2గా పిలుస్తున్న ఈ అణు పరీక్షలు జరిగిన మే 11ని భారత ప్రభుత్వం జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది. ​

విప్లవాత్మకమైన మార్పులు..

టెలీ కమ్యూనికేషన్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, లేజర్, ఫైబర్ ఆప్టిక్స్ తదితర రంగాల్లో టెక్నాలజీపరంగా విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి.  ప్రపంచ మార్కెట్​లో పోటీని ఎదుర్కోవాలంటే ఆయా దేశాలు టెక్నాలజీ, విజ్ఞాన విస్తృతి మీదనే ఆధారపడతాయి. అది మనదేశంలో 1974లోనే మొదలై ఇప్పటికీ కొనసాగుతోంది. సాంకేతికంగా ఇండియా దూసుకువెళ్తోంది.

మంచికే వాడాలి..

గతంలో ల్యాండ్​ ఫోన్‌‌నే కొంత మంది తమ స్టేటస్ సింబల్‌‌గా భావించే వారు.  ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్​ ఫోన్లు ఉంటున్నాయి. ఆన్​లైన్​ షాపింగ్​ దగ్గర నుంచి ఆన్​లైన్​ విద్య వరకూ టెక్నాలజీ డెవలప్​ అయింది. ఎడ్ల బండి నుంచి విమానం వరకు.. ఉత్తరాల నుంచి వీడియోకాల్ వరకూ..  మనుషుల మధ్య దూరాన్ని తగ్గించింది. టెక్నాలజీని మంచికి వాడుకున్న దేశాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి. చెడుకు వాడుకున్న దేశాలు సాపేక్షంగా వెనకబడిపోతాయి.
- నరేందర్ రాచమల్ల, 
సోషల్​ ఎనలిస్ట్​.