
ఆధునిక సాంకేతిక యుగంలో అన్ని రంగాల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో విద్యారంగంలోనూ సాంకేతిక జ్ఞానం కీలకంగా మారింది. సాంకేతిక జ్ఞానం లేకుండా విద్యార్థులు ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం కష్టం. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు మౌలిక బలాన్ని కల్పించవచ్చు.
ప్రతి విద్యార్థికి విద్యలో సాంకేతిక జ్ఞానం తప్పనిసరిగా అందించాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే, విద్యారంగంలో ముందడుగులు పడుతున్నప్పటికీ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఆధునిక సాంకేతికతకు దూరంగా ఉన్నారనే వాస్తవాన్ని గ్రహించాలి. పాఠశాలల్లో సాంకేతికపరంగా చూస్తే ఇటీవల ప్రభుత్వం డిజిటల్ స్క్రీన్‌లు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
కానీ, ఈ ఒక్క పరికరం ద్వారా మాత్రమే ఆధునిక ప్రపంచంతో విద్యార్థులు సాంకేతికంగా పోటీపడలేరు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే స్టూడెంట్స్ ఆధునిక సాంకేతిక విద్యకు చేరువ కావాలి. వారు కూడా సాంకేతిక ప్రపంచంలో దూసుకుపోవాలి. ఈ కీలక ఆంశాలు విస్మరించదగినవి కావు. ఈ అంతరం తీర్చడానికి ఆధునిక సైన్స్ ల్యాబ్‌లతో పాటు, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతిక పరికరాలను వినియోగించుకోవడం ఎంతో అవసరం.
ఆధునిక సైన్స్ ల్యాబ్, వర్చువల్ రియాలిటీ
టెక్నాలజీ ద్వారా విద్యా బోధన అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. సాంకేతిక విజ్ఞానం ఇప్పుడు ప్రాథమిక విద్యలో భాగం కావాల్సిన అంశంగా మారింది. విద్యార్థులు ప్రస్తుత శాస్త్ర సాంకేతిక రంగంలో ముందుకు దూసుకెళ్లాలంటే ఆధునిక సాంకేతిక పాఠశాలలు, సైన్స్ ల్యాబ్స్, వర్చువల్ రియాలిటీ (వీఆర్) వంటి సాధనాలు వారికి అందించాలి. ఇలా చేయడం ద్వారా వారు సాంకేతిక ప్రపంచంలో అనేక అవకాశాలు సొంతం చేసుకోగలుగుతారు.
తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో చదివే స్టూడెంట్స్‌కు ఆధునిక సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో ఇటీవల తెలంగాణ డెవలప్‌మెట్ ఫోరం (టీడీఎఫ్) పలు చోట్ల ‘సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్’ వాహనాలను ప్రారంభిస్తోంది. ఇప్పటికే యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఎమ్మెల్సీ,ప్రొ. కోదండరాం సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ వాహనాన్ని ప్రారంభించారు.
టీడీఎఫ్ తమ సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ ప్రాజెక్టులో భాగంగా రెండో సైన్స్ ల్యాబ్ వాహనాన్ని భువనగిరిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) కోసం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సైన్స్ సబ్జెక్టులను వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా బోధించడం విప్లవాత్మక ముందడుగు అని టీడీఎఫ్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న ఈ ప్రాజెక్టును కోదండరాం ప్రశంసించారు.
సాంకేతికతదే ప్రధాన పాత్ర
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సైన్స్ విద్యను అందించే ప్రయత్నాన్ని తమ సంస్థ నిరంతరం కొనసాగిస్తుందని టీడీఎఫ్- ఇండియా అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. వర్చువల్ రియాలిటీ, రోబోటిక్స్ వంటి సాంకేతిక పద్ధతులు విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడం మాత్రమే కాకుండా, ఆలోచనా శక్తిని ప్రేరేపిస్తాయి. వీటితో విద్యార్థులు ప్రత్యక్షంగా అనుభవాలను పొందడంతోపాటు వాటిని సులువుగా అర్థం చేసుకుంటారు.
ALSO READ | మేధావులూ మౌనాన్ని వీడండి!
ప్రతి పాఠశాలలో ఆధునిక సైన్స్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం వంటి సబ్జెక్టులు సమగ్రంగా నేర్పవచ్చు. ఇది విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంపై గట్టి పునాదిని వేస్తుంది. భవిష్యత్తులో అన్ని రంగాల్లో సాంకేతికత ప్రధాన పాత్ర పోషించనుంది. కాబట్టి, చిన్న వయసు నుంచే విద్యార్థులను సాంకేతికతకు అలవాటు చేయడం ముఖ్యం. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతిక విద్య అనివార్యమని గుర్తించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతిక పాఠశాలలను అభివృద్ధి చేయడం ఒక సవాల్ అయినప్పటికీ, ఇది విద్యార్థులకు ఒక వెలకట్టలేని అవకాశంగా భావించాలి.
సాంకేతిక విద్యా విప్లవానికి నాంది
‘సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్’ ప్రారంభం తెలంగాణలో సాంకేతిక విద్యా విప్లవానికి నాంది పలకనుంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను పెంచే దిశగా ఒక కీలకమైన ముందడుగు. టీడీఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ మన బడి ప్రాజెక్టులో భాగంగా సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ ప్రారంభించింది. రాబోయే ఐదేండ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా ప్రాక్టికల్స్ చేయించి, వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని టీడీఎఫ్ లక్ష్యంగా పెట్టుకుందని టీడీఎఫ్ -యూఎస్ఏ అధ్యక్షుడు శ్రీనివాస్ మాణికొండ చెప్పారు.
సైన్స్ ల్యాబ్ పరికరాలతోపాటు వర్చువల్ రియాలిటీ ద్వారా విద్యార్థులకు బోధించాలి. రాష్ట్రంలోని 600కి పైగా మండలాల్లో విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణతో పాటు వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి విద్యార్థులకి చేరువ చేసేందుకు టీడీఎఫ్ కృషి చేస్తున్నది. ఈ మొబైల్ సైన్స్ ల్యాబ్ పరికరాలు, ప్రాక్టికల్ శిక్షణతో సైన్స్ మీద ఆసక్తిని పెంచడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు పాఠ్య పద్ధతుల్లో మౌలిక విజ్ఞానాన్ని అందించడం టీడీఎఫ్ లక్ష్యంగా పెట్టుకుంది.
- సిద్ధగౌని సుదర్శన్,సీనియర్ జర్నలిస్ట్