సైబర్​ నేరగాళ్లే పెద్ద సమస్య

సైబర్ క్రైమ్...ఈ మాట వింటుంటే ముచ్చెమటలు పట్టకమానవు. ఒకప్పటి  సినిమాల్లో భయంకరమైన రౌడీల వేషాల్లో వచ్చి, కిడ్నాపులు చేయడం,  దోపిడీలకు పాల్పడడం వంటి సన్నివేశాలు కనిపించేవి. అయితే,  ఈ ఆధునిక సమాజంలో దారుణంగా క్షణాల్లో  మోసాలు జరిగిపోతున్నాయి. కాలు బయటకు కదపకుండా, కోట్లు కూడబెట్టే విద్యలో  కొంతమంది ఆరితేరిపోయారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం సైబర్ నేరగాళ్ళకు కాసుల పంటగా మారింది.  ఎక్కడో విదేశాల్లో కూర్చుని, చెమట పట్టకుండా, విద్యాధికులకు సైతం మొచ్చెమటలు పట్టించే వికృతమైన క్రీడా విన్యాసానికి పర్యాయపదంగా సైబర్ క్రైమ్ పేరుగాంచింది. 

ప్రభుత్వ పథకాల పేరుతో, బ్యాంకు అధికారుల పేరుతో  వివిధ రకాలుగా బెదిరింపులకు పాల్పడుతూ, ఏటీయం పిన్ చెప్పమంటూ అజ్ఞాత వ్యక్తులు  మాయమాటలు చెప్పడం, కేవైసీ అప్ డేట్ కోసమంటూ ఓటీపీ అడగడం, మొబైల్ ఫోన్లకు మెసేజ్​లు పంపడం,  వాట్సాప్​లో  లింకులు పంపించి, క్లిక్  చేయమనడం ద్వారా డబ్బులు కాజేయడం వంటి సంఘటనలు పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి. అక్షరాస్యులు,  నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా నమ్మించి, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడంతో ఏం చేయాలో అర్థంకాక ఎంతో మంది ఆవేదన చెందుతున్నారు.   సైబర్ క్రైమ్ నేరాలను  నిరోధించడానికి టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వబడ్డాయి. అనేక కేసులు నమోదవుతున్నాయి. అయితే కేసులు పెట్టడం వలన ఎంతమంది నేరస్థులు పట్టుబడుతున్నారో, ఎలాంటి శిక్షలు విధిస్తున్నారో అర్థం కావడం లేదు.  భారతదేశంలో డిజిటల్ అరెస్టులు లేకపోయినా,  వీటిపేరుతో నేరస్థులు సాగిస్తున్న కార్యకలాపాలకు బెంబేలెత్తిపోతున్న  అమాయకుల  ఆక్రందనలకు అడ్డుకట్టవేయలేమా? ప్రభుత్వం ఈ విషయంలో మరింత శ్రద్ధపెట్టి సైబర్​ నేరగాళ్ల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలి.

- సుంకవల్లి సత్తిరాజు