మూఢ నమ్మకంతో స్వీయ బలిదానం చేసుకున్న దంపతులు

టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నా... కొందరు మాత్రం ఇంకా మూఢ నమ్మకాలను నమ్ముకుని తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు. తాజాగా గుజరాత్ లో ఓ దంపతులు.. తమ తలలను శిరచ్ఛేదం చేసుకుని.. ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన రాజ్‌కోట్‌ జిల్లా వింఛియలో సంచలనం రేపింది.  

దేవుడి మీద అపారమైన భక్తితో మధ్య వయస్కులైన దంపతులు సినిమాటిక్‌గా తల నరికి..దేవుడికి సమర్పించిన ఘటన గుజరాత్‌ లో జరిగింది. హెముభాయ్‌ మక్వానా (38), హంసబెన్‌ (35) భార్యాభర్తలు.. శనివారం (ఏప్రిల్ 15వ తేదీ ) అర్థరాత్రి తమ గ్రామంలోని పొలం వద్ద గుడిసెలో స్వీయబలి ఇచ్చుకున్నారు. వారి తలలు తెంచేసేలా గిలెటిన్‌ లాంటి ఒక పరికరాన్ని స్వయంగా తయారు చేసుకున్నారు. దీనికి పదునైన పెద్ద రంపాన్ని అమర్చి ఒక తాడు కట్టారు. పక్కనే మంటను ఏర్పాటు చేసుకున్నారు. ఈ పరికరం కింద దంపతులిద్దరూ పడుకొని... ఆ తాడు వదలగానే ఆ రంపం వారి తలలను కోసేసింది. ఆ తర్వాత తెగిన తలలు ముందే ఏర్పాటు చేసుకున్న మంటలో పడ్డాయి. మూఢనమ్మకంతోనే ఈ విధంగా వారు తమను తాము బలి ఇచ్చుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

గత ఏడాది నుంచి  హెముభాయ్‌ మక్వానా దంపతులు... తమ గుడిసెలో దేవుడికి పూజలు చేస్తున్నారని స్థానికులు చెప్పారు. ఈ పూజలకు కొనసాగింపుగా...దంపతులు తమ తలలను దేవునికి సమర్పించాలని నిర్ణయించుకుని.. ఈ పని చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. భర్యాభర్తలిద్దరూ కలిసి పథకం ప్రకారం వారి తలలు తెగిపోయిన తర్వాత అగ్నిలోకి దొర్లినట్లు, ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించిందని వించియా సబ్-ఇన్‌స్పెక్టర్ ఇంద్రజీత్‌సిన్హ్ జడేజా తెలిపారు. 

స్వీయబలి చేసుకునే ముందు దంపతులు వారి బంధువులకు లేఖ రాశారు. తమ వృద్ధ తల్లిదండ్రులను, ఇద్దరు పిల్లలను బాగా చూసుకోవాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని లేఖలో కోరారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరు పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇంకా షాక్ నుంచి తేరుకోవడం లేదు. 

అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇద్దరు కుమార్తెలను తల్లిదండ్రులే అతి కిరాతకంగా పొట్టనబెట్టుకున్న ఉదాంతం తీవ్ర సంచలనం రేపింది. భక్తి ఉండాలి. నమ్మకం ఉండాలి. కానీ మూఢభక్తితో కొందరు సాగిస్తున్న అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.