ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బెంజ్ కారు.. తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి

ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బెంజ్ కారు.. తీగల కృష్ణారెడ్డి మనవడు మృతి

మలక్ పేట, వెలుగు: తీగల కృష్ణారెడ్డి మనవడు, మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ తీగల సునరితా రెడ్డి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మలక్ పేట బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తీగల అజిత్ రెడ్డి, మూసారాంబాగ్ డివిజన్ మాజీ కార్పొరేటర్ తీగల సునరితారెడ్డి దంపతుల కొడుకు కనిష్క్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో (19) మృతి చెందాడు. టెక్ మహీంద్రా కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న కనిష్క్ గురువారం రాత్రి జూబ్లీహిల్స్ లోని తన ఫ్రెండ్ ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు హాజరయ్యాడు. తిరిగి తన బెంజ్ కారులో వస్తుండగా, పెద్ద గోల్కొండ – తుక్కుగూడ మధ్య ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద ఆగి ఉన్న ట్రాలీ లారీని ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో కనిష్క్​తలకు తీవ్ర గాయం కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం తల్లిదండ్రులు మెరుగైన చికిత్స కోసం మలక్ పేట యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కనిష్క్ రెడ్డి మృతి చెందారు.

కనిష్క్ రెడ్డి మృతదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. వీరిలో మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, నగర మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు అబ్దుల్లా బలాల, సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రేటర్ నాయకుడు ఆజం అలీ, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బడంగ్ పేట మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి,  టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చెకోలేకార్ శ్రీనివాస్, ముసరాంబాగ్ డివిజన్ కార్పొరేటర్లు బొక్క భాగ్యలక్ష్మి మధుసూదన్ రెడ్డి, నగర ప్రస్తుత, మాజీ కార్పొరేటర్లు ఉన్నారు.