సీరోల్: మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. జిల్లాలోని సీరోల్ మండల కేంద్రంలో ఉన్న ఏకలవ్య గురుకులంలో సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూ రోజా అనే ఇంటర్ ఫస్టియర్ సీఈసీ విద్యార్ధిని కుప్పకూలి పడిపోయింది. వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్ధిని మృతి చెందినది.
విద్యార్ధిని స్వస్థలం మరిపెడ మండలం తానంచర్ల గ్రామ శివారు సపవత్ తండా. కూతురుని కోల్పోయిన తల్లిదండ్రులు గుండెలు పడిలేలా రోదించారు. తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్డియాక్ అరెస్ట్ వల్ల విద్యార్థిని చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
కార్డియాక్ అరెస్ట్ అంటే అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం. గుండె పనితీరును అకస్మాత్తుగా కోల్పోవడం. గుండె ఎలక్ట్రికల్ సర్క్యూట్ సరిగ్గా పని చేయనప్పుడు ఇది జరుగుతుంది. ఈ సమయంలో ఈ అసహజ లయల సమయంలో గుండె త్వరగా, అస్థిరంగా కొట్టుకుంటుంది. తద్వారా శరీరమంతా రక్తాన్ని తగినంతగా పంప్ చేయడం గుండెకు కష్టమవుతుంది.
ఆరోగ్యకరమైన గుండె లయ, ప్రసరణకు సజావుగా సాగడానికి తక్షణ వైద్య సంరక్షణ అవసరం. ఈ సమయంలో సీపీఆర్ (CPR) చేయడం, డీఫిబ్రిలేటర్ ఉపయోగించడం వంటివి చేయడం చాలా ముఖ్యం. గాయపడిన గుండె కండరాలు క్రమరహిత హృదయ స్పందనలకు కారణమవుతాయి కాబట్టి గుండె ఆగిపోయే అవకాశం ఉందని గుర్తుంచుకోవడం ముఖ్యం. కానీ కార్డియాక్ అరెస్ట్లో మాత్రం అకస్మాత్తుగా గుండె ఆగిపోతుంది. ఎటువంటి ముందస్తు లక్షణాలు లేకుండా కూడా ఇది జరుగుతుంది.