సినిమాల ప్రభావమో.. సోషల్ మీడియా ప్రభావమో లేక ఈ జనరేషన్ ఆలోచనాతీరులో లోపమో కానీ.. నేటి యువతలో అసహనం, ఆవేశం విపరీతంగా పెరిగిపోయాయి. అనుకున్నది జరగకపోతే.. బలవన్మరణానికి పాల్పడడమా లేక ఎదుటివారిని అంతమొందించటమే అనేంత స్థాయికి దిగజారుతున్నారు చాలామంది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో జరిగిన దారుణ ఘటన చూస్తే యువత ఇంత ప్రమాదంలో ఉందా అన్న భయం కలుగుతోంది. తనను ప్రేమించలేదని.. బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ విద్యార్ధి. సోమవారం ( డిసెంబర్ 9, 2024 ) జరిగిన ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి..
నంది కొట్కూరు మండలం రామ్మళ్ళ కోట గ్రామానికి చెందిన లక్ష్మి జీవనోపాధి కోసం కూలి పనులు చేసుకుంటూ నందికొట్కూరులో స్థిరపడింది.. 14ఏళ్ళ కిందటే భర్త కోల్పోయిన లక్ష్మి ఒక్కగానొక్క కూతురైన లహరిని చదివించుకుంటూ బతుకుతోంది. 14 ఏళ్ళ లహరి పల్నాడు జిల్లా మాచర్ల మండలం వెల్దుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూలులో చదువుతోంది. పదవ తరగతి చదువుతున్న లహరికి వెల్దుర్తి మండలం కలగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్రతో చనువు ఏర్పడింది. ఈ సానిహిత్యంతో రాఘవేంద్ర ప్రేమ పేరిట లహరి వెంట పడ్డాడు. తన చదువులకు ఆటంకం కల్గించొద్దని లహరి దూరమైంది.
ఆ తర్వాత లహరి నందికొట్కూరులోని బైరెడ్డి నగర్లో తాత, అమ్మమ్మ దగ్గరే ఉంటూ, నందికొట్కూరులో సీనియర్ ఇంటర్ చదువుతోంది. ఇటీవల మళ్లీ రాఘవేంద్ర తన ప్రేమను వ్యక్తం చేయగా.. లహరి అంగీకరించలేదు. దీంతో.. ఆదివారం ( డిసెంబర్ 8, 2024 ) తెల్లవారుజామున బైరెడ్డి నగర్ లోని లహరి ఇంటికి వెళ్లి తన ప్రేమను వ్యక్తం చేశాడు రాఘవేంద్ర. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ముందుగానే పథకం ప్రకారం పెట్రోలు తీసుకు వచ్చిన రాఘవేంద్ర కిరాతకంగా లహరి నోటిలో గుడ్డలు కుక్కి పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఒళ్ళంతా కాలిపోయిన లహరి అక్కడిక్కడే మృతి చెందింది.
ALSO READ | డ్యూటీలో ఉన్న హోంగార్డుపై దాడి.. మూడేళ్ల జైలు శిక్ష
తర్వాత నిందితుడు రాఘవేంద్ర బయటకు వచ్చి తాను కూడా పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ అలజడికి మేల్కొన్న జనం విషయం తెలుసుకొని షాక్ అయ్యారు. స్థానికులు రాఘవేంద్రను పట్టుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుండి తప్పించుకొని.. గాయాలతో ప్రభుత్వాసుపత్రిలో చేరాడు రాఘవేంద్ర.
ఈ దారుణ ఘటన గురించి తెలుసుకున్న నంద్యాల ఎస్పీ ఘటనాస్థలికి చేరుకొని బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు ఎస్పీ అదిరాజ్ సింగ్. ఈ క్రమంలో లహరిని పెట్రోల్ పోసి నిప్పంటించి అతి కిరాతకంగా చంపిన కిరాతకుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.