ఆమె వయసు చిన్నదే.. కానీ ఆమె తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా పెద్దది. లివర్ ప్రాబ్లెంతో బాధపడుతున్న తండ్రిని బతికించుకునేందుకు తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసింది. దేశంలోనే అవయవ దానం చేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఈ ఘటన కేరళలోని త్రిసూర్‌లో జరిగింది. 48 ఏళ్ల ప్రతీష్ స్థానికంగా కేఫ్ నిర్వహిస్తున్నాడు. అతనికి 17 ఏండ్ల కుమార్తె ఉంది. ఆమె పేరు దయానంద .. 12 వ తరగతి చదువుతోంది. గత కొంత కాలంగా ప్రతీష్ అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేరాడు. పరీక్షించిన డాక్టర్లు అతని లివర్ దెబ్బతినడంతో పాటు క్యాన్సర్ సోకినట్లుగా గుర్తించారు.
దీంతో అతని కుటుంబం డోనర్ కోసం చాలా ప్రయత్నాలు చేసింది. ఎవరూ ముందుకు రాకపోవడంతో తన కాలేయంలో కొంత భాగం ఇచ్చేందుకు దేవానంద ముందుకు వచ్చింది. వాస్తవానికి అయితే మైనర్లు అవయవాలను దానం చేయడానికి అనుమతి లేదు. మానవ అవయవ మార్పిడి చట్టం 1994 ప్రకారం అది నేరం. కానీ దేవానంద కేరళ హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంది. తన తండ్రి ఆరోగ్యం కోసం కుమార్తె చేస్తున్న ప్రయత్నాలను కోర్టు కూడా ప్రశంసించింది.
అవయవదానం చేసే ముందు ఆమె జిమ్ కెళ్లి వ్యాయామం చేసింది. ప్రత్యేక డైట్ తీసుకుంది. తాజాగా ఈ నెల 9న అలువాలోని రాజగిరి ఆసుపత్రిలో దేవానంద తన లివర్‌లోని కొంత భాగాన్ని తండ్రికి ఇచ్చింది. లివర్ మార్పిడి శస్త్రచికిత్స సక్సెస్ కావడంతో తండ్రీకూతుళ్లిద్దరూ వారం రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తండ్రి కోసం కుమార్తె పడుతున్న తాపత్రాయన్ని అర్థం చేసుకున్న ఆసుపత్రి.. సర్జరీ ఖర్చులను పూర్తిగా మాఫీ చేసింది.