- తల్లిదండ్రులు, తోబుట్టువులపై బుల్లెట్ల వర్షం
- తమ్ముడే అందర్ని చంపి ఆత్మహత్య చేసుకున్నడని పోలీసులకు కట్టుకథ
- చనిపోయినట్టు నటించి ప్రాణాలతో బయటపడ్డ చెల్లి
- స్పృహలోకి వచ్చాక అసలు వాస్తవాల వెల్లడి
న్యూఢిల్లీ: గన్ కల్చర్ అమెరికాలో మరోసారి బీభత్సం సృష్టించింది. 15 ఏండ్ల బాలుడు తల్లిదండ్రులతోపాటు తోడబుట్టిన వారిని షూట్చేసి చంపేశాడు. ఈ ఘోరంలో మొత్తం ఐదుగురు చనిపోయారు. 13 ఏండ్ల తమ్ముడే మొత్తం ఫ్యామిలీని గన్తో కాల్చి చంపేశాడని.. తను ఒక గదిలో దాక్కున్నానని పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. అయితే ఈ ఘటనలో బుల్లెట్ తగలగానే చనిపోయినట్లు నటించిన 11 ఏండ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. స్పృహలోకి వచ్చాక శనివారం పోలీసులకు అసలు వాస్తవాలు వివరించింది.
వాషింగ్టన్ డీసీ రాష్ట్రం ఫాల్ సిటీలో నివసించే మార్క్ హ్యూమిస్టన్ కు భార్య, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. గత సోమవారం తెల్లవారు జామున 5 గంటలకు అతని 15 ఏండ్ల కొడుకు ఇంట్లో ఉన్న గన్తో కుటుంబ సభ్యులపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ముందుగా తల్లిదండ్రులు, తర్వాత ముగ్గురు తోబుట్టువులను చంపేశాడు. ఈ సందర్భంగా అతను జరిపిన కాల్పుల్లో చేతికి, మెడ వద్ద బుల్లెట్ గాయం కాగానే 11 ఏండ్ల చిన్నారి రక్తపుమడుగులో పడి చనిపోయినట్లు నటించింది. ఆ తర్వాత గాయాల వల్ల రక్తం కోల్పోయి స్పృహ కోల్పోయింది.
బుల్లెట్ల వర్షం కురిపించి కుటుంబం మొత్తాన్ని చంపేసిన బాలుడు.. తర్వాత పోలీసులకు కాల్ చేసి తన 13 ఏండ్ల సోదరుడు గన్తో కాల్పులు జరిపి ఇంట్లో వాళ్లందరిని చంపేశాడని.. తర్వాత తను కాల్చుకొని ఆత్మహ్యత చేసుకున్నాడని చెప్పాడు. తాను తప్పించుకొని ఒక గదిలో దాక్కున్నానని తెలిపాడు. పోలీసులు వచ్చి బాలుడిని సంరక్షణలోకి తీసుకొన్నారు. మృతదేహాలను తరలిస్తుండగా ఆపస్మారక స్థితిలో ఉన్న బాలికను గుర్తించారు.
ట్రీట్మెంట్ తర్వాత కోలుకున్న బాలిక శనివారం పోలీసులకు అసలు సంగతి తెలిపింది. తన 15 ఏండ్ల అన్ననే ఇంట్లో వారందరిని గన్తో కాల్చి చంపేశాడని వెల్లడించింది. స్థానిక కోర్టు ఆదేశాలతో ఆ బాలుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నరు. అలాగే అతను తన సోదరిని కలవకుండా, ఆమె మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసును ఆదేశించారు. సొంత కుటుంబాన్ని అంతం చేసిన బాలుడిని జువైనల్ చట్టం కింద కాకుండా వయోజనుల చట్టం కింద విచారించాలని స్థానికులు కోరుతున్నారు.