- ఆలస్యమవుతున్న ఓట్ల లెక్కింపు
- జంబో పోస్టల్ బ్యాలెట్ కావడమే కారణం
- ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్సులను తెరిచిన ఆఫీసర్లు
- సాయంత్రం 4 గంటల వరకు కట్టలు కట్టడానికే సరి
- ఇయ్యాల సాయంత్రానికి తేలనున్న ఫస్ట్ ప్రయారిటీ’ ఫలితం
నల్గొండ, వెలుగు: నల్గొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి ఆయన ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచారు. బుధవారం ఉదయం 8 గంటలకు నల్లొండలో మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగుతున్నది. పోలైన ప్రతి ఓటును ఏజెంట్లు, పార్టీ క్యాండిడేట్లు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో జంబో బ్యాలెట్‌ను వాడాల్సి వచ్చింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఉప ఎన్నికలో ప్రతి ఓటు కీలకంగా మారింది. దీంతో కౌంటింగ్ హాల్లో ఏజెంట్లు, అభ్యర్థులు ప్రతి బ్యాలెట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్సులను తెరిచిన అధికారులు.. పోలైన 3,36,013 ఓట్లను కట్టలు కట్టే సరికి సాయంత్రం 4 గంటలు అయింది. ఆ తర్వాత నుంచి మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నది. వాస్తవానికి రాత్రి 7.30 గంటలకు మొదటి రౌండ్ ఫలితం ప్రకటిస్తారని భావించారు. కానీ కౌంటింగ్‌లో హా ల్లో ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడం కూడా ఓట్ల లెక్కింపునకు ఆలస్యమవుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి బరిలో నిలిచారు.
నేటి సాయంత్రానికి..!
తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం సాయంత్రం వరకు పూర్తయ్యే అవకాశం కనిపిస్తున్నది. మొత్తం నాలుగు రౌండ్లలో మొదటి ప్రయార్టీ ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. పోలైన 3,36,013 ఓట్లను నాలుగు రౌండ్లలో లెక్కిస్తారు. ఒక్కో రౌండ్లో 96 టేబుల్స్‌పైన 96 వేల ఓట్లను లెక్కిస్తారు. ఆఖరి రౌండ్లో మాత్రం 48,013 ఓట్లతో లెక్కింపు ప్రక్రియ ముగుస్తుంది. అధికారుల అంచనా మేరకు ప్రతి మూడు గంటలకోసారి ఒక రౌండ్ ఫలితం ప్రకటించాలి.
కానీ జంబో బ్యాలెట్ కావడంతో ఓపెన్ చేసిన ప్రతి బ్యాలెట్ పేపర్‌ను మూడు టేబుళ్లకు మార్చాల్సి వస్తున్నది. బ్యాలెట్ పేపరు పెద్దగా ఉండటం, టేబుళ్లు చిన్నగా ఉండటంతో ఓపెన్ చేసిన బ్యాలెట్ పేపర్‌ను ఏజెంట్లు క్షుణంగా పరిశీలించి ఓకే చెప్పాకే తిరిగి క్లోజ్ చేయాల్సి వస్తున్నది. దీంతో ఓట్ల లెక్కింపు కోసం చాలా టైం పడుతున్నది.