గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ : రెండోవ రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లీడ్

 నల్గొండ – ఖమ్మం – వరంగల్​ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్​ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ లో 96 వేల ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల రెండో రౌండ్ లో తీన్మార్ మల్లన్న 6  వేలకు పైగా ఓట్లతో లీడ్ లో కొనసాగుతున్నారు. చెల్లని ఓట్లు వేరు చేసే ప్రక్రియ కొనసాగుతుంది.

 ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేయడంతో జంబో బ్యాలెట్​ను వాడాల్సి వచ్చింది. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఉప ఎన్నికలో ప్రతి ఓటు కీలకంగా మారింది. దీంతో కౌంటింగ్​ హాల్​లో ఏజెంట్లు, అభ్యర్థులు ప్రతి బ్యాలెట్​ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం సాయంత్రం వరకు పూర్తయ్యే అవకాశం కనిపిస్తున్నది. 

అధికారుల అంచనా మేరకు ప్రతి మూడు గంటలకోసారి ఒక రౌండ్​ ఫలితం ప్రకటించాలి. కానీ జంబో బ్యాలెట్​ కావడంతో ఓపెన్​ చేసిన ప్రతి బ్యాలెట్​ పేపర్​ను మూడు టేబుళ్లకు మార్చాల్సి వస్తున్నది. బ్యాలెట్​ పేపరు పెద్దగా ఉండటం, టేబుళ్లు చిన్నగా ఉండటంతో ఓపెన్​ చేసిన బ్యాలెట్​ పేపర్​ను  ఏజెంట్లు క్షుణంగా పరిశీలించి ఓకే చెప్పాకే తిరిగి క్లోజ్​ చేయాల్సి వస్తున్నది. దీంతో ఓట్ల లెక్కింపు కోసం చాలా టైం పడుతున్నది.