తెలంగాణలో వచ్చేది బీసీ సర్కారే.. బీసీలకు చట్టపరమైన వాటా దక్కాల్సిందే

  • బీసీల్లో రాజకీయ చైతన్యం మొదలైంది
  • వారికి చట్టపరంగా రావాల్సిన వాటా దక్కాల్సిందే: తీన్మార్ మల్లన్న

న్యూఢిల్లీ, వెలుగు: బీసీల్లో రాజకీయ చైతన్యం మొదలైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. తెలంగాణలో నెక్స్ట్​వచ్చేది బీసీ సర్కారేనని పేర్కొన్నారు. బీసీలకు చట్టపరంగా రావాల్సిన వాటా దక్కాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ ఓట్లతోనే రాజకీయం చేస్తున్నాయని మల్లన్న విమర్శించారు. 

వెనకబడిన వాళ్లు అన్ని రకాలుగా మరింత వెనుక బడుతూనే ఉన్నారని మల్లన్న ఆందోళన వ్యక్తం చేశారు. అందులోనూ బీసీలను మరింత వెనక్కి నెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. 60 శాతం ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేయడం అన్యాయమని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కులగణన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని చెప్పారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని దేశంలో ఓబీసీలను కులాలపరంగా గణన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఓబీసీల హక్కుల సాధన కోసం ఈ నెల 11న కాన్స్టిట్యూషన్ క్లబ్ లో సదస్సు, ధర్నా నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ ఎంపీలు  పార్లమెంట్ సమావేశాల్లో ముక్తకంఠంతో లేవనెత్తాలని ఆయన డిమాండ్ చేశారు.