ఓటమి భయంతోనే బీఆర్ఎస్​ నిందలు .. అధికారులపై ఆరోపణలు అబద్ధం: తీన్మార్ మల్లన్న

నల్గొండ, వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ఓటమి తప్పదని తెలిసే అధికారులపై బీఆర్ఎస్ నేతలు నిందలు వేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. ఆ పార్టీ నేతలు కౌంటింగ్ హాల్ నుంచి ఉత్త చేతులతో పోవడం ఎందుకని, అధికారుల మీద మన్ను పోసి పోయే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గురువారం కౌంటింగ్ కేంద్రం వద్ద తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, కౌంటింగ్​అధికారులపై బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చేసిన ఆరోపణలు అబద్ధమని చెప్పారు. ‘‘కేటీఆర్ డైరెక్షన్​లో రూ.100 కోట్లు పెట్టి అక్రమంగా గెలుపొందాలని బీఆర్ఎస్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. 

గతంలో మాదిరిగా బోగస్ ఓట్లతో లబ్ధి పొందాలని చేసిన కుతంత్రం కూడా పారలేదు. అందుకే నాపై అనేక రకాలుగా బురదజల్లారు. అది కూడా బెడిసికొట్టడంతో ఇప్పుడు అధికారులపై పడ్డారు. ‘ఆట ఆడదాం రా అంటే పాత గజ్జెలు ఉన్నాయి. నేను ఎలా ఆడుతా అన్నాడంట వెనకటికి ఎవడో’.. అట్లున్నది బీఆర్ఎస్ తీరు. యుద్ధంలో గెలవలేక, నాకు ఆఫీసర్లు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపణలు చేయడం దుర్మార్గం. ఆఫీసర్లు లోపలికి నా సెల్ ఫోన్ కూడా అనుమతించలేదు. ఒకవేళ అధికారులు నాకు సపోర్ట్ చేసినట్లయితే, నా సెల్​ఫోన్​లోపలికి వచ్చేది కదా?” అని అన్నారు. బీఆర్ఎస్ నేతల మాటలు చూస్తుంటే, ముందే ఓటమిని ఒప్పుకున్నట్టుగా ఉందన్నారు. ‘‘బీఆర్ఎస్ వాళ్లు కౌంటింగ్​కేంద్రాన్ని విడిచి వెళ్లవద్దు. దయచేసి తుది ఫలితం వచ్చేదాకా ఉండి వెళ్లాలి. లేదంటే కేటీఆర్ ఫోన్ రాగానే మరో కార్యక్రమం చేపట్టే ప్రమాదం ఉంది” అని అన్నారు.