బీఆర్ఎస్ పార్టీ అస్తికలు ధర్మపురి గోదారిలో కలుపుతం : తీన్మార్ మల్లన్న

ఈ నెల 30న బీఆర్ఎస్ పార్టీ అస్తికలు ధర్మపురి గోదారిలో కలుపుతామని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని చర్లపల్లి జైల్లో పెట్టే వరకు పోరాడుతూనే ఉంటానని చెప్పారు. శనివారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాం పల్లిలో  ధర్మపురి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్​ కుమార్​కు మద్దతుగా తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ నాయకుడు గడ్డం వంశీకృష్ణ  ప్రచారం నిర్వహించారు. 

తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, ధర్మపురి నియోజకవర్గ ప్రజలు హింస, దోపిడీ, ఆరాచకం, అణచివేతకు గురయ్యారని, పరిష్కారం కోసం ఈ నెల 30న జరిగే పోలింగ్ కోసం వేచి చూస్తున్నారని తెలిపారు. తలాపున గోదావరి ఉన్నా.. తాగు, సాగు నీటికి కష్టాలు ఉన్నాయన్నారు. కేసీఆర్ ఫాంలో సాగు నీటి కోసం ప్రాజెక్టులు కట్టుకున్నాడని విమర్శించారు.  

కేసీఆర్, కొప్పులను నిరుద్యోగులను చేద్దాం: వంశీ కృష్ణ 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించి.. కేసీఆర్, కేటీఆర్, కొప్పులను నిరుద్యోగులను చేద్దామని కాంగ్రెస్ యువ నేత గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. ‘‘మా తాత కాకాను కలిసేందుకు సైకిల్​పై వచ్చిన కొప్పుల ఈశ్వర్ కోట్లు ఎలా సంపాదించాడో చెప్పాలి” అని ప్రశ్నించారు. ‘‘మా తండ్రి వివేక్ వెంకటస్వామి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమంలో పోరాటం చేశారు. బంగారు తెలంగాణ వస్తుందనుకుంటే బ్రోకర్ల తెలంగాణగా తయారైంది”అని అన్నారు. అంతకుముందు రాజారాంపల్లి బీఆర్ఎస్‌కు గ్రామ సర్పంచ్ శేఖర్,  సుగ్రీవరావుతో పాటు 500 మంది కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కటారి చంద్రశేఖర్ రావు, ఎండీ బషీర్, జాడి రాజేశం, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.