
అచ్చంపేట, వెలుగు: కేసీఆర్ పాలనలో వైన్స్ నోటిఫికేషన్లు మాత్రమే సక్సెస్ అయ్యాయని కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న విమర్శించారు. బుధవారం అచ్చంపేటలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే రాష్ట్ర ప్రజలందరూ ఆగమవుతారని హెచ్చరించారు. మేడిగడ్డ, మియాపూర్ భూములు, మిషన్ భగీరథ పథకంలో లక్షల కోట్ల రూపాయలను కేసీఆర్ మింగాడని ఫైర్ అయ్యారు. కాగా, కార్నర్ మీటింగ్ టైమ్ అయిపోయిందని ఎన్నికల అధికారులు కాసేపు అడ్డుకున్నారు. తనపై 73 కేసులు ఉన్నాయని ఇంకొక కేసు పెట్టుకోండని అధికారులకు మల్లన్న చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ, నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.