
- డిసెంబర్ 3 తరువాత బీఆర్ఎస్ బొక్కలను గోదాట్లో కలుపుతామని కామెంట్
హుస్నాబాద్, వెలుగు : తెలంగాణ కోసం చావు నోట్లో తల పెట్టిన ఉద్యమకారులెవరూ వెనక్కి రాలేదని, సీఎం కేసీఆర్ ఎలా బతికారని కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసింది దొంగదీక్ష అని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న సంపద అంతా ఎలా దోచుకోవాలన్న దానిపైనే సీఎం నిరంతరం ఆలోచిస్తారని మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తరపున మల్లన్న ప్రచారం చేశారు. తెలంగాణను దోచుకునే కుట్రతోనే కేసీఆర్ ఉద్యమ ముసుగు వేసుకున్నారని మల్లన్న ఫైర్ అయ్యారు. 1400 మందిని చంపి కేసీఆర్ కుటుంబం పదేండ్లుగా వేడుక చేసుకుంటున్నదని ధ్వజమెత్తారు. ‘‘కాళేశ్వరం పేరుతో కేసీఆర్ రూ.లక్ష కోట్లు దోచుకున్నాడు. పేదలకు డబుల్బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని, ఊరుకో శ్మశానవాటికను నిర్మించాడు. వాటిని చూస్తేనే ప్రజలకు చావు ఆలోచన వస్తోంది. ఆయన పథకాలు ప్రజలు చనిపోయాక లబ్ధి చేకూర్చేవి. భూస్వాముల కోసమే రైతుబంధు తెచ్చిండు. కేసీఆర్ కుటుంబ సెగ్మెంట్లు గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో నీళ్లు పారించుకొని హుస్నాబాద్ నియోజకవర్గంలో కన్నీళ్లు నింపింది. పదేండ్లు గడిచిపోయినా గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేయలేదు. నిర్వాసితుల ఇండ్లపై వందల మంది పోలీసులను ఉసిగొల్పి మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా కొట్టించాడు. ఇక్కడి ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు హుస్నాబాద్ ప్రజల బాధలు తెలియవు. అసెంబ్లీలో సతీశ్ మాట్లాడిందే లేదు” అని మల్లన్న విమర్శించారు. డిసెంబర్ 3 తరువాత బీఆర్ఎస్ బొక్కలను గోదాట్లో కలుపుతామని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ వస్తేనే తెలంగాణ బాగవుతుంది :
హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్
ఎల్కతుర్తి, వెలుగు : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ బాగవుతుందని హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న తో కలిసి ఆదివారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని దామెర, చింతలపల్లె, శాంతి నగర్ గ్రామాల్లో ఆయన ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ హుస్నాబాద్ ను సెంటిమెంట్ గా భావిస్తారు తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. టీపీసీసీ మెంబర్ అశోక్ రెడ్డి, సీపీఐ జిల్లా నాయకుడు కర్రె భిక్షపతి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.