నల్గొండ అర్బన్, వెలుగు:పేదల పక్షాన పోరాడుతున్న తనను భవిష్యత్ తరాల కోసం గెలిపించాలని వరంగల్–-ఖమ్మం-–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) కోరారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్ర కోర్టులో బార్ అసోసియేషన్ న్యాయవాదులను, జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల, మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో మార్నింగ్ వాకర్స్ తో కలిసి వాకింగ్ చేసి ఎమ్మెల్సీ ఓటు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రతినిధుల ఎంపిక తర్వాత రైట్ టు రీ కాల్ అవకాశం ప్రజలకు ఉండాలన్నారు. ఎన్నుకున్న నాయకుడు సంతృప్తికరంగా పని చేయనప్పుడు రీ కాల్ చేసే అవకాశం ప్రజలకు ఉండాలని అప్పుడే ప్రజా ప్రతినిధులు భయం బాధ్యతతో పని చేస్తారని తెలిపారు.
తాను రైటు టు రీ కాల్ అవకాశాన్ని ఇస్తానని.. తన పనితీరు నచ్చకపోతే ప్రజలు రీకాల్ చేయోచ్చని తెలిపారు. ఏ రాజకీయ నాయకుడు తన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించని తీరుగా తాను ఇప్పటివరకు తనకున్న స్థిరాస్తులను ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలిపారు. ప్రత్యర్థులను తనను బేరీజు వేసుకొని భవిష్యత్ తరాలకు ఎవరు అవసరమో వారిని ఎన్నుకోవాలన్నారు.
తన మీద నమ్మకంతో ఓటు వేసే వారికి ఆశాభంగం కలిగించనని స్పష్టం చేశారు. సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగిరి వెంకట్రెడ్డి, 150 మంది న్యాయవాదులు పాల్గొని మల్లన్నకు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో తడకమల్ల కిరణ్ కుమార్, నాంపల్లి నరసింహ, కంచనపల్లి జవహర్ లాల్, ఆదిరెడ్డి, నేతి రఘుపతి, రంజిత్ కుమార్, కట్టెల శివ, కామేశ్ తదితరులు పాల్గొన్నారు.