నల్గొండ, వెలుగు: నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. బుధవారం మొదలైన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం రాత్రి 8 గంటలకు పూర్తయింది. మొత్తం 3,36,013 ఓట్లు పోల్ కాగా.. మల్లన్నకు 1,22,813 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. అంటే మల్లన్న 18,565 ఓట్ల మెజార్టీ సాధించారు. అయితే పోలైన ఓట్లలో 50 శాతం పైచిలుకు ఓట్లు ఎవరికి వస్తే, వాళ్లనే విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో 25,877 చెల్లకుండా పోయాయి.
దీంతో చెల్లుబాటు అయిన 3,10,136 ఓట్లలో ఎవరికైతే 1,55,095 ఓట్లు వస్తాయో, వాళ్లను విజేతగా ప్రకటిస్తారు. కానీ ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రాత్రి 9 గంటల నుంచి రెండో ప్రయారిటీ ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. మల్లన్నకు పోలైన ఓట్లను పరిశీలిస్తే, గెలుపు అవకాశాలు ఆయనకే ఎక్కువగా ఉన్నాయి. రెండో ప్రయారిటీ ఓట్లలో మల్లన్నకు 32,282 వస్తే ఆయనే విజేతగా నిలుస్తారు. అదే రాకేశ్ రెడ్డి గెలుపొందాలంటే, ఆయనకు 50,847 ఓట్లు రావాల్సి ఉంటుంది. రెండో ప్రాధాన్యత ఓట్లలో నాలుగు రౌండ్లలో కూడా మల్లన్నకే మెజార్టీ వచ్చింది. చివరి రౌండ్లో ఓట్లు తక్కువగా ఉన్నందున మెజార్టీ తగ్గినట్టు కనిపించింది.
ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలు..
ఎలిమినేషన్ ప్రాసెస్‌లో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు. మొత్తం 52 మంది అభ్యర్థుల్లో మల్లన్న, రాకేశ్ రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, అశోక్‌కుమార్ ను మినహాయిస్తే.. మిగతా 48 మంది అభ్యర్థులకు కలిపి 10,065 ఓట్లు పోలయ్యాయి. ఆ 48 మంది ఓట్లను బదిలీ చేయడానికి ఎక్కువ సమయం పట్టదని అధికారులు చెబుతున్నారు. అయితే అభ్యర్థి గెలుపుకు ఆ ఓట్లు కూడా సరిపోనందున అశోక్ కుమార్‌కు వచ్చిన 29,697 ఓట్లు, ప్రేమేందర్ రెడ్డికి వచ్చిన 43,313 ఓట్లను కూడా లెక్కించాల్సి ఉంటుంది.
2021 నాటి సీన్ రిపీట్..
2021 ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డికి, మల్లన్నకు మధ్య గట్టి పోటీ జరిగింది. కోదండరామ్‌కు పోలైన ఓట్లలో రెండో ప్రయారిటీ ఓట్లను మల్లన్నకు బదిలీ చేసినా పల్లా రాజేశ్వరెడ్డిని చేరుకోలేకపోయారు. ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ అవుతున్నది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో మల్లన్నకు 1.22 లక్షల ఓట్లు వచ్చినందున, రెండో ప్రాధాన్యత ఓట్లలో మల్లన్నను చేరుకోవడం రాకేశ్ రెడ్డికి అంత సులువు కాదు. కాబట్టి గెలుపు మల్లన్నదే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కౌంటింగ్‌లో అవతవకలు..
కౌంటింగ్‌లో అవతవకలు జరుగుతున్నాయి. మేం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అంశాలను ఆర్వో బుట్టదాఖలు చేస్తున్నారు. అడిగిన డేటా ఇవ్వడం లేదు. నాలుగో రౌండ్ లో మెజార్టీ ఉన్నప్పటికీ, అంతా గోల్మాల్ చేశారు. మూడో రౌండ్ ఫలితాలపై అనేక అనుమానాలు ఉన్నాయి. మళ్లీ కౌంటింగ్ చేయాలని కోరుతున్నాం. మా గెలుపును అడ్డుకునే కుట్ర జరుగుతోంది.
- రాకేశ్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి
ఆరోపణలు కాదు..ఆధారాలు ఉంటే చూపండి
కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నది. ఏజెంట్ల సంతకాల తర్వాతే ఫలితాలు ప్రకటిస్తున్నాం. ఆరోపణలు చేస్తున్నవాళ్లు ఆధారాలుంటే చూపించాలి. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో అభ్యర్థులు పదేపదే ప్రశ్నలు వేయడం, ఒకే బ్యాలట్‌ను రెండుమూడు సార్లు చూపించాలని అడగడంతో కౌంటింగ్ ఆలస్యమైంది. కౌంటింగ్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవుతున్నది.
- దాసరి హరిచందన, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్, నల్గొండ