పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గట్టేక్కే పరిస్థితి లేక బీఆర్ఎస్ అభ్యర్థి అధికారుల మీద బురద చల్లుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఓటమి తప్పదని.. బీఆర్ఎస్ నేతలు ప్రెస్టేషన్ కి గురవుతున్నారని అన్నారు. కేటీఆర్ వందల కోట్లు ఖర్చు పెట్టి గెలవాలని చూశారని విమర్శించారు. బోగస్ ఓట్లతో లబ్ది పొందాలని చూసిన వాళ్ళు... ఇప్పుడు అధికార పార్టీ అభ్యర్థిపై బురద జల్లాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
యుద్ధంలో గెలవలేక.. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికల బరిలో పాల్గొనకుండా ... అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారని తీన్మార్ మల్లన్న మండిపడ్డారు. అందరికి సమాన రూల్స్ ప్రకారమే అధికారులు పని చేస్తున్నారని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ చూస్తేనే అర్ధం అవుతుంది.. ఓటమి ఒప్పుకున్నారని చెప్పారు. కేటీఆర్ డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారని ... రిజల్ట్ చివరివరకు డ్రామా స్టార్ట్ చేస్తారని మల్లన్న అన్నారు.