సూర్యాపేట, వెలుగు: భద్రాద్రి పవర్ ప్లాంట్, కరెంట్ కుంభకోణంలో మాజీ సీఎం కేసీఆర్ తోక పట్టుకొని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి మండలి చిత్ర పటాలకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డితో కలిసి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీపై కాంగ్రెస్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. కేసీఆర్ మద్దతు తెలపడంతోనే సింగరేణి బొగ్గు గనులు వేలం వేయాల్సిన పరిస్థితి దాపురించిందని విమర్శించారు. రూ.3,500 కోట్ల లాభాలతో సింగరేణిని గత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌కు అప్పగిస్తే.. ప్రస్తుతం కార్మికుల జీతాలు కూడా మోదీ ఇవ్వాల్సిన దుస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని మండిపడ్డారు.
విద్యుత్ శాఖపై రూ.80 వేల కోట్ల నష్టం తెచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పడావు పడిన భూములకు సైతం రైతు బంధు ఇచ్చిందని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే రైతు బంధు ఇచ్చి వారిని ఆదుకుంటుందని వెల్లడించారు. వరికి, వాణిజ్య పంటలకు మద్దతు ధర కల్పించి, ఇచ్చిన మాటను రాష్ట్ర సర్కార్ నిలబెట్టుకోబోతోందని చెప్పారు. పేదలకు భూములిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, పేదల భూములు కబ్జా పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అని గ్రామ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలదే అని స్పష్టం చేశారు.
హామీలను నిలబెట్టుకుంటాం: దామోదర్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రుణమాఫీ నిర్ణయం చరిత్రాత్మకమైందని మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. రైతులకిచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని చెప్పారు. సూర్యాపేట నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేయడంతో ఆ ఇండ్లు పనికి రాకుండా పోయాయన్నారు. త్వరలో ఇందిరమ్మ కమిటీలు వేసి అర్హులైన వారికి ఇండ్లు, కొత్త పింఛన్లు కూడా ఇస్తామని తెలిపారు.
గత పదేండ్లలో సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఆయన అనుచరులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సూర్యాపేట నియోజకవర్గ అభివృద్ధికి నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణరెడ్డి, డీసీసీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.