తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట/కోదాడ/హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్/హసన్ పర్తి, వెలుగు: గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకు గ్రాడ్యుయేట్లు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఆదివారం సూర్యాపేట, కోదాడ, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో కలిసి మంత్రి హాజరై మాట్లాడారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అధిక మెజార్టీ వస్తుందని, ఈ ఎన్నికలో మల్లన్న గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజారిటీ వస్తుందన్నారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు మల్లన్న విజయానికి కృషి చేయాలని కోరారు. 

జగదీశ్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం: తీన్మార్ మల్లన్న

భూ దందాలు, అక్రమ ఇసుకతో రూ.వేల కోట్లు సంపాదించిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి త్వరలో జైలుకెళ్లడం ఖాయమని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. పదేండ్లుగా ప్రజల హక్కుల కోసం కొట్లాడుతున్న తనపై కేసీఆర్ 100 అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించారని, ఇప్పుడు ఆయన బిడ్డకు అదే గతి పట్టిందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కొత్తగా 20 యూట్యూబ్ చానళ్లు పెట్టి తీన్మార్ మల్లన్నను బద్నాం చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే 2 లక్షల ఉద్యోగాలు, గురుకుల టీచర్ల నియామకంతో పాటు 1990 డీఎస్సీ భాదితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హనుమకొండలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న ఓ కన్వెన్షన్‌‌‌‌ హాల్‌‌‌‌లో జరిగిన రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకులు, కేయూ జేఏసీ నేత మేడారపు సుధాకర్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మల్లన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నామరూపాల్లేకుండా పోయినప్పటికీ.. కేసీఆర్‌‌‌‌‌‌‌‌, కేటీఆర్‌‌‌‌‌‌‌‌ తమ తప్పులను ఎందుకు అర్థం చేసుకోవడం లేదన్నారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌‌‌‌ మానవతారాయ్‌‌‌‌ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికలో మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.