![బీసీ జాతుల గొంతు మీద కాలు పెడ్తామంటే ఊరుకొం బిడ్డా.. అంతు చూస్తాం: తీన్మార్ మల్లన్న](https://static.v6velugu.com/uploads/2025/02/teenmar-mallannas-hot-comments-on-bcs_Sd7eFvrlGR.jpg)
హైదరాబాద్: ఎవరైనా బీసీ జాతుల గొంతు మీద కాలు పెడ్తామ్ అంటే ఊరుకొం బిడ్డా.. మీ అంతు చూస్తామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్ చేశారు. బంజారాహిల్స్ కళింగభవన్లో తెలంగాణ ప్రభుత్వ కులగణన సర్వే రిజర్వేషన్ల పూర్వాపరాలు, సమస్యలు, ఆందోళనకర అంశాలు, పరిష్కార మార్గాలు అంశంపై బుధవారం (ఫిబ్రవరి 12) మేధోమధన సదస్సు నిర్వహించారు. -పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సెస్(pccc), అల్ ఇండియా బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ (AIBCF), తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు తీన్మార్ మల్లన్న హాజరై ప్రసంగించారు.
మనం ఇప్పటి వరకు కులగణనలోని లోపాలను సమాజం ముందు పెట్టినం.. ప్రభుత్వం చేసిన బీసీ లెక్కలు తప్పు అనడానికి అనేక విధాలుగా ప్రజల ముందు ఉంచామన్నారు. మరీ ప్రభుత్వం బీసీ లెక్కల తప్పిదాలను ఎప్పుడు సరిచేస్తదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల ఆర్థిక పరమైన లెక్కలు కూడా బయటికి రావాలని.. 2 లక్షల 91 వేల కోట్ల బడ్జెట్లో బీసీలకు సగం రావాల్సిందేనన్నారు. ఉమ్మడి ఏపీ నుంచి కూడా బీసీలపై జరిగిన ఆర్థిక దోపిడి అంశాన్ని చర్చకు తీసుకోవాలని.. బీసీలకు జరిగిన అన్యాయన్ని అన్ని రంగాల్లో లెక్కలు తీస్కొని ప్రజలకు వివరించాలని కోరారు. బీసీలకు సీట్లు పార్టీలు వేసే బిచ్చమ్ అని.. అదే రిజర్వేషన్స్ మాత్రం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని అన్నారు.
ALSO READ | అసమానతలు రూపుమాపుతం.. ప్రతి గడపకూ వర్గీకరణ ఫలాలు: మంత్రి దామోదర రాజనర్సింహ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలనే గెలిపించాలి.. ఆ దిశగా మనం ప్రణాళిక రచించాలి.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్స్ ఉండాలని బీసీలకు పిలుపునిచ్చారు. బీసీల కోసం గొంతెత్తి నాకు పార్టీ నోటీసులు ఇస్తే.. ఈ సభ నాకు మద్దతుగా నిలిచిందని ధన్యవాదాలు తెలిపారు. బీసీ రిజర్వేషన్స్ సాధించడమే మా అందరి అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పుడున్నది గత తెలంగాణ కాదు.. ఎడ్డి తెలంగాణ కాదు.. చైతన్యం ఉన్న తెలంగాణ.. బీసీలు చైత్యంతో ఉన్నారని అన్నారు. జిల్లా, గ్రామీణ ప్రాంతంలో బీసీలు చర్చ పెట్టాలని.. తీన్మార్ మల్లన్న టీంలో ఆధ్వర్యంలో కొన్ని గ్రామాల్లో జనాభా లెక్కలు తీస్తామని.. ఆ లెక్కలను గ్రామ పంచాయతీ దగ్గర అతికిస్తామని పేర్కొన్నారు.