హైడ్రా కేసులో తహసీల్దార్​కు ముందస్తు బెయిల్‌

హైదరాబాద్, వెలుగు: చెరువుల ఆక్రమణలకు సహకరించాడనే అభియోగంపై నమోదైన కేసులో బాచుపల్లి తహసీల్దార్​ పూల్‌ సింగ్‌కు హైకోర్టులో ఊరట లభించింది.  నిజాంపేట మున్సిపాల్టీలోని ప్రగతినగర్‌ లోని 3 ఎకరాల ఆక్రమణలకు సహకరించారంటూ పూల్‌సింగ్‌పై  హైడ్రా కమిషనర్‌ ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేశారు.

నిజాంపేట మున్సిపల్‌ కమిషనర్‌ రామకృష్ణరావు, బాచుపల్లి తహసీల్దార్​ పూల్‌సింగ్‌, సర్వే శాఖ సహాయ డైరెక్టర్‌ కె. శ్రీనివాసులు, సహాయ ప్లానింగ్‌ అధికారి సుధీర్‌ కుమార్‌లపై ఆగస్టు 30న పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ పూల్‌సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ కె. సుజన గురువారం విచారించి ముందస్తు బెయిల్‌ మంజూరు చేశారు.